వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. కడపలో రాజీవ్ పార్క్‌ను ప్రారంభించారు. వేల రూపాయలు వెచ్చించి పార్కును అందంగా తీర్చిదిద్దారు. పిల్లల కోసం ఆట సదుపాయాలు.. పెద్దల కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు.. ఈ పార్కు చుట్టూ వేల సంఖ్యలో నివాసాలు ఉన్నాయి. ఉదయం, సాయంత్రం నడకకు వచ్చే వారితో... వారి పిల్లలతో ఈ పార్కు ఒకప్పుడు ఎంతో సందడిగా కనిపించేది. రాను రాను పర్యవేక్షణ లోపించి మురుగు కుంటగా మారింది.
పార్కు చుట్టూ ఉన్న రోడ్డు క్రమంగా ఎత్తుగా కావడంతో పార్కు పల్లమైంది. వర్షపు నీరంతా పార్కులోకి చేరుతోంది. మురుగు వ్యవస్థ సరిగా లేక నీరు నిల్వ ఉండి.. పాచి పట్టింది. అధికారులు పట్టించుకోవడం మానేశారు. క్రమంగా జనం కూడా రావడం మానేశారు. ఇప్పుడు పార్కును పూర్తిగా మూసేశారు.
కడప నగరం మొత్తానికి నెహ్రు పార్కు, రాజీవ్ పార్కు రెండే ఉన్నాయి. రాజీవ్ పార్కును మూసేయడంతో నగరవాసులుకు ఆహ్లాదం కరవైంది. విలువైన భూమిని కబ్జా చేసేందుకే ఇలా పార్కును నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. కడప నగరం నడిబొడ్డున ఉన్న రాజీవ్ పార్కుకు పునర్ వైభవం తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు.