కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో దేశవ్యాప్తంగా కరవు ప్రభావం అధికంగా ఉన్న 255 జిల్లాల్లో నీటిని పొదుపు చేయాలనే ఉద్దేశంతో జలశక్తి అభియాన్ అనే కార్యక్రమం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 జిల్లాలో ఈ పథకం అమలైంది. కడప జిల్లాలోని 13 మండలాల్లో జలశక్తి అభియాన్ పథకం అమలు చేశారు. 2019లో చేపట్టిన పనులకు గానూ 255 జిల్లాల్లో ర్యాంకుల ఆధారంగా మార్కులు ప్రకటించిన కేంద్ర జలశక్తి అభియాన్ అధికారులు.. దక్షిణాధి రాష్ట్రాల్లో కడపజిల్లాకు ప్రథమ స్థానం ప్రకటించారు. ఇందులో భాగంగా చిన్నమండెం, లింగాల, సింహాద్రిపురం, ఓబులవారిపల్లె, పెనగలూరు, సంబేపల్లి, రాజంపేట, వేముల, వేంపల్లె మండలాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి.
జిల్లాలో రెండేళ్లలో దాదాపు 18 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకిందని అధికారులు అంటున్నారు. జలశక్తి అభియాన్లో భాగంగా ఉపాధి హామీ పథకం కింద 19వేల 829 పనులు చేపట్టగా... ఇతర విభాగంలో లక్షా 98 వేల పనులు చేశారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వంద శాతం పనులకు జియో ట్యాగింగ్ చేశారు. దాదాపు నాలుగు నెలల కాలంలో 60 వేల కిసాన్ మేళాలు నిర్వహించారు. దీని ద్వారా రైతులకు, మహిళకు ఉపాధి పనులు, భూగర్భజలాల వృద్ధిపై అవగాహన కల్పించారు. మొత్తం 100 మార్కులకు కడప జిల్లాకు 84.84 మార్కులు రావడంతో దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది.
వరుసగా రెండేళ్లు అగ్రస్థానం..
జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు చేపట్టిన జలశక్తి అభియాన్ పథకంలో... ప్రధానంగా ఐదు అంశాల ఆధారంగా కేంద్రం మార్కులు కేటాయించింది. ఎంపిక చేసిన జిల్లాలు... వాటి పరిధిలో వాన నీటి సంరక్షణ నిర్మాణాలు, సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, రీచార్జ్ నిర్మాణాల ద్వారా బోరు బావులు పునరుద్ధరించడం, వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాలు, విస్తృత అటవీకరణ వంటి విభాగాల్లో మంచి ప్రతిభ కనబరిచిన జిల్లాలకు కేంద్ర జలశక్తి అభియాన్ ర్యాంకులు కేటాయించింది.