కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని దృశ్య మాధ్యమ కేంద్రంలో మంగళవారం ఎస్పీ అన్బురాజన్, సంయుక్త కలెక్టర్లు గౌతమి, సాయికాంత్‌వర్మ, డీఎంహెచ్‌వో డాక్టర్ అనిల్‌కుమార్‌లతో కలిసి.. కలెక్టర్ హరికిరణ్ కరపత్రాలు ఆవిష్కరించారు. ఆరోగ్య సమాజ నిర్మాణంలో 45 ఏళ్ల పైబడినవారంతా కొవిడ్ టీకా వేయించుకోవాలని కడప కలెక్టర్ హరికిరణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. తొలి దశలో 20,884 మంది ఆరోగ్య, అంగన్‌వాడీ కార్యకర్తలకుగాను 13,675 మందికి టీకా వేశారని చెప్పారు.
రెండో దశలో 35,800 మంది పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ కార్మికులు, సచివాలయ సిబ్బందికిగానూ 20 వేల మందికి టీకా వేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ టీకా వేస్తున్నారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేస్తుండగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.250 వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లా నుంచి వారానికి కొన్ని నమూనాలు సేకరించి హైదరాబాద్ సీసీఎంబీకి పంపుతున్నామని, జిల్లాలో పూర్తిస్థాయిలో కరోనాను రూపుమాపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు.