ఇటీవల కురిసిన వర్షాలకు కడపజిల్లా చింతకొమ్మదిన్నె మండంలోని బుగ్గవంక ప్రాజెక్టులో భారీగా నీరు చేరింది. కడప నగరం మీదుగా బుగ్గవంక ప్రవహిస్తుంది. నగరంలో బుగ్గవంక కాలువలకు రక్షణ గోడలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇప్పటికే రెండు సార్లు టెండర్లు పిలిచినా... ఆక్రమణల తొలగింపు అడ్డంకిగా మారి గుత్తేదారులు చేతులెత్తేశారు. ఇప్పుడు మరోమారు టెండర్లు పిలిచినా... వాటిని రక్షణ గోడల నిర్మాణానికి కాకుండా రహదారుల నిర్మాణం కోసం వెచ్చిస్తున్నారు.
2001లో విషాద ఘటన
బుగ్గవంక ప్రాజెక్టుకు వరద పోటెత్తితే....నాలుగు గేట్లు ఎత్తివేస్తారు. గేట్లు ఎత్తితే కడప నగరంలోని బుగ్గవంక కాలువల ద్వారా 33 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. కానీ 2001 అక్టోబరు 16న ఒకేసారి 69 వేల క్యూసెక్కుల వరద నీరు బుగ్గవంకకు రావడం వల్ల కడప నగరం జలదిగ్భంధంలో చిక్కుకుంది. నాడు బుగ్గవంక ప్రాజెక్టు నుంచి 33 వేల క్యూసెక్కులు, మూలవంక నుంచి 36 వేల క్యూసెక్కుల వరద ఒకేసారి కలిసి రావడం వల్ల బుగ్గవంక సామర్థ్యానికి మంచి ప్రవహించింది. ఫలితంగానే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అనంతరం అధికారం చేపట్టిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ...బుగ్గవంక సుందరీకరణ చేపట్టాలని 2005లో నిర్ణయం తీసుకున్నారు.
2005లో రూ.35 కోట్లు విడుదల
కడప శివారులోని రైల్వే బ్రిడ్జి నుంచి అల్మాస్ పేట వరకు బుగ్గవంక కొనసాగుతోంది. ఇరువైపులా కలిపి 8.2 కిలోమీటర్ల వరకు బుగ్గవంక ఉంది. అయితే బుగ్గవంక సామర్థ్యం 69 వేల క్యూసెక్కులకు పైగానే తట్టుకునే విధంగా కాల్వలు వెడల్పు చేయడం, రక్షణ గోడలు ఎత్తుగా నిర్మించడంతో పాటు రెండు... డబుల్ హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. బుగ్గవంక రక్షణ గోడల కోసం 2005లో ప్రభుత్వం రూ.35 కోట్లు విడుదల చేసింది. అనంతరం పనులు ప్రారంభించిన గుత్తేదారు ఆక్రమణను తొలగించలేక...రూ.13 కోట్ల పనులు చేసి ఒప్పందం రద్దు చేసుకున్నారు.