బంగారం,వెండి కొనుగోళ్లకు కడప జిల్లాలో పెట్టింది పేరు.అయితే ప్రొద్దుటూరు అక్రమాలకు కేంద్రస్థానంగా నిలుస్తోంది.సిరిపురిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి...పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు.ఇదే అదునుగా చేసుకుని అక్రమ రాయుళ్లు చెలరేగిపోతున్నారు.కిలోల కొద్దీ బంగారం,వెండిని అక్రమ మార్గంలో విక్రయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.బెంగళూరు,చెన్నై,కోయంబత్తూరు ప్రాంతాల నుంచి వీటిని తరలిస్తూ వ్యాపారులకు విక్రయిస్తున్నారు.వీటిని వర్తకులు వినియోగదారులకు మార్కెట్ ధరకే విక్రయిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు.నెలకు దాదాపు5కోట్ల రూపాయలకు పైగా బిల్లులు లేని బంగారం,వెండి ప్రొద్దుటూరుకు సరఫరా అవుతోందని అంచనా.
భారీగా పట్టుబడుతోన్న అక్రమ బంగారం! - illegal business news in kadapa
పండగలు , శుభకార్యాలే వారి టార్గెట్. ప్రజలకు బంగారంపై ఉన్న ఇష్టాన్ని అవకాశంగా చేసుకుని అక్రమ రవాణాదారులు రెచ్చిపోతున్నారు. పన్ను చెల్లించని పసిడిని విచ్చలవిడిగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వరుసగా కిలోల కొద్దీ అక్రమ బంగారం పట్టుబడుతుండటం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది.

తనిఖీల్లో కిలోల మేర బంగారం,వెండి పట్టుబడుతుండటం పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎలాంటి ఆధారాలు లేని5కిలోల700గ్రాముల బంగారు బిస్కెట్లను ఎర్రగుంట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గత నెల19న ప్రొద్దుటూరులో ఓ వ్యక్తి నుంచి2కిలోలు,ఈ నెల4న మరో ఇద్దరి నుంచి700గ్రాములు బంగారం, 31కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి.వీటికి ఎలాంటి రశీదులు లేనందున వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించారు.తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల నుంచి కొందరు మధ్యవర్తుల సాయంతో....ప్రొద్దుటూరులోని దుకాణాల్లో పనిచేసే కొందరు గుమాస్తాల ద్వారా ఈ అక్రమ రవాణా సాగుతోందని తెలుస్తోంది.
ఈ బంగారం అంతా సాధారణ తనిఖీల్లో భాగంగానే పట్టుబడిందని పోలీసులు చెబుతున్నారు.పోలీసు,వాణిజ్యపన్నుల శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తే....ఈ అక్రమ రవాణాను నియంత్రించవచ్చన్నది వాణిజ్య నిపుణుల అభిప్రాయం.