RAINS IN AP: వైఎస్ఆర్ జిల్లాలోరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు జల దిగ్బంధం అయింది. ఉరుములు..మెరుపులతో కూడిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. పట్టణంలోని ప్రధాన వీధూలైన గాంధీరోడ్డు, రాజీవ్ కూడలి, కొర్రపాడు రోడ్డు, జిన్నా రోడ్డుతో పాటు పలు కాలనీలు నీటితో నిండిపోయాయి. రహదారులపై నీళ్లు నిండిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయల్లోకి భారీ ఎత్తున వర్షపు నీరు చేరింది. అగ్నిమాపక కార్యాలయంలోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
అనంతపురం:జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా వేకువజాము నుంచే చిరుజల్లులు కురుస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఎండలతో అల్లాడిపోతున్న జనం చిరుజల్లులతో సేదతీరుతున్నారు.
బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లాలో పలుచోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. బాపట్ల, చీరాల, పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. బాపట్ల పట్టణంలో కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. మార్టూరులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కిశోర్ కాలనీలో ఓ ఇంటిపై పిడుగు పడి 8 ఏళ్ల బాలిక మృతిచెందింది. తల్లి గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంగళవారం అన్నదాతలు పూజలు నిర్వహించి పొలాలు దుక్కి దున్నారు. ఇంతలోనే వర్షం కురవటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.