కడప జిల్లా గండికోట అందాలకు ఎంతటివారైనా ఫిదా కావాల్సిందే. ఇక్కడ 8 కిలోమీటర్ల మేర గండికోట ప్రహరీ గోడలు, పలు రాతి కట్టడాలు కనిపిస్తాయి. సినిమా షూటింగ్‌లూ.. జరుగుతాయి. ఇప్పుడీ గండికోట సాహస క్రీడలకూ చిరునామాగా మారింది. ఏడాది క్రితం గండికోటలో అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటైంది. దక్షిణ భారతదేశంలో ఒకేచోట 3 విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు అనువైన ఏకైక ప్రాంతం గండికోటేనని నిర్వాహకులు చెప్తున్నారు. భూమిపైన చేసే ర్యాప్లింగ్, క్లైంబింగ్, ట్రెక్కింగ్‌కు అందమైన ఎర్రరాతి కొండలు కలిసొచ్చాయి. ఇక ఇక్కడ జాలువారే పెన్నానదీ జలపాతం నీటిలో చేసే సాహసాలకు నెలవుకానుంది. విశాల ప్రాంతం కావడంతో ప్యారాగ్లైడింగ్ చేయొచ్చు.
గండికోటలో అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రస్తుతం ర్యాప్లింగ్, క్లైంబింగ్, ట్రెక్కింగ్ నేర్పుతున్నారు. ప్రస్తుతం 30 మంది వరకూ యువత హైదరాబాద్, బెంగళూరు నుంచి వారాంతంలో ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. ఇక గండికోటకు 400 కిలోమీటర్లపరిధిలోని పట్టణాల నుంచి సరదగా వచ్చి అడ్వెంచర్లు చేసి వెళ్తుంటారని.. శిక్షకులు చెప్తున్నారు.