'వైద్యులను వేధించడాన్ని వ్యతిరేకిస్తూ.. తమ ఆసుపత్రుల్లో కొవిడ్-19 రోగులను చేర్చుకోవడం ఆపేశాం' అని కడప నగరంలో ప్రైవేట్ ఆసుపత్రుల ఎదుట బ్యానర్లు వెలిశాయి. ఇప్పడు ఇది చర్చనీయాంశమైంది. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని స్థానిక నేతలు, ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం, జిల్లా అధికారులు త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగింది..?
కడపలో ఇప్పటి వరకు 8 ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స చేయడానికి అనుమతి ఇచ్చారు. ఇటీవల రెండు ఆసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని కేసులు నమోదు చేశారు. దీనికి వ్యతిరేకంగా ఆసుపత్రుల యాజమాన్యాలు చికిత్స నిలిపివేత నిర్ణయానికి వచ్చాయి. దీనిపై ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఈ విషయం తెలిసిందని, నివేదిక తెప్పించుకుంటామని స్పష్టం చేశారు.
కొవిడ్‌కు చికిత్స నిలిపివేత నిర్ణయం వాళ్లు సొంతంగా తీసుకున్నారు. దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇబ్బందులు, అధికారుల వైఖరిపై ఆయా ఆసుపత్రుల వారు కలెక్టర్‌ను కలిసి వివరించుకుంటారు. కలెక్టర్ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తర్వాత కార్యాచరణ ఉంటుంది.-శ్యాంసుందర్ రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు
సోషల్ మీడియాలో వైరల్..
ఆసుపత్రుల ముందు బ్యానర్లు ఏర్పాటు చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై జిల్లా కలెక్టర్ హరికిరణ్ స్పందించి... వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలు, ఐఎంఏ బాధ్యులతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే.. తన దృష్టికి తీసుకురావాలని, ఇలా బ్యానర్లు పెట్టడం ఏంటని అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్‌తో మాట్లాడిన వెంటనే ఆయా ఆసుపత్రులు బ్యానర్లు తొలగించడం కొసమెరుపు.
సుబ్బరాయుడు, కడప న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు కరోనా అలజడి సృష్టిస్తున్న సమయంలో ప్రైవేటు వైద్యులు కరోనాకు వైద్యం చేయబోమంటూ చెప్పడం దారుణం. తక్షణం ప్రైవేటు వైద్యులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అంతమాత్రాన ప్రైవేటు వైద్యులు రోగులకు వైద్యం చేయమని బోర్డు ఏర్పాటు చేయడం సరైంది కాదు. చట్టం ఎవరికీ చుట్టం కాదనే విషయాన్ని ప్రైవేటు వైద్యులు గుర్తుంచుకోవాలి. కరోనా రోగులకు వైద్యం చేయకుంటే న్యాయపరంగా వారిపై చర్యలుంటాయి.-సుబ్బరాయుడు, కడప న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు
కలెక్టర్ హెచ్చరిక..!
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్ వైద్య సేవలను నిలిపివేసిన కడపలోని ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు దిగి వచ్చాయి. కొవిడ్ సేవలు నిలిపివేస్తున్నట్లు బోర్డులు పెట్టడం తప్పేనని... క్షమించాలని వేడుకున్నారు. ఈమేరకు కడప కలెక్టరేట్లో కలెక్టర్ హరికిరణ్ ఆద్వర్యంలో ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యాలతో సమావేశం జరిగింది. విజిలెన్స్, పోలీసు, డీహెంచ్ఓ, ఇంటెలిజెన్స్ అధికారుల సమక్షంలో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. కొవిడ్ సేవలు నిలిపి వేయాలని నిర్ణయం మంచిది కాదని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.
ఇదీ చదవండీ... విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షల నిర్వహణ: సీఎం