8, 9 తేదీల్లో అనంతపురం, కడప జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంత్రి సందర్భంగా నిర్వహిస్తున్న రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గోనేందుకు సీఎం జగన్ కడప, అనంతపురం జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. జులై 8, 9 తేదీల్లో అనంతపురం, బద్వేలు, కడప, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు.
జూలై 8వ తేదీ ఉదయం 8.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని.. 10.40 గంటలకు అనంతపురం జిల్లాలో పలు కార్యక్రమాల్లో హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా పులివెందులకు చేరుకోనున్నారు. పులివెందులలోని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్ గ్రౌండ్ వద్ద నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం హెలికాప్టర్లో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్స్‌కు చేరుకుని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
జూలై 9వ తేదీ ఉదయం 10.40 గంటలకు బద్వేలులోని విద్యానగర్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో.. సీపీ బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలో ఉన్న మహావీర్ సర్కిల్ వద్ద వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలోనూ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం ఐదు గంటల అనంతరం తిరిగి విజయవాడ వెళ్లనున్నారు.