తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పులివెందుల నియోజక వర్గం అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ(పాడా)పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు, పలువురు అధికారులు హాజరయ్యారు. పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన పనుల్లో ఎక్కడా జాప్యం ఉండొద్దని సీఎం అధికారులను ఆదేశించారు.
ఎక్కడైనా భూమి పూజ చేసిన తర్వాత వీలైనంత త్వరగా పనులు మొదలు కావాలని, పనుల్లో ఏ మాత్రం జాప్యం జరగకూడదని, నిర్ణీత వ్యవధిలోగా వాటిని పూర్తి చేయాలని సూచించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దన్నారు. సాగు నీటి కింద మంజూరైన వివిధ పనులకు జ్యుడీషియల్ ప్రివ్యూ వేగంగా పూర్తి చేసి టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలన్నారు. జాతీయ రహదారి మాదిరిగా ముద్దనూరు–కొడికొండ చెక్‌పోస్టు రహదారిని నిర్మించాలని సీఎం ఆదేశించారు. పులివెందులను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ నిర్మాణం, సిటీ సెంటర్, సెంట్రల్ బోలీవార్డు, స్లాటర్ హౌజ్‌ల నిర్మాణం చేపట్టాలన్నారు. అన్ని లే అవుట్లలో నీటి సరఫరాతో పాటు, సీవరేజ్ పనులు చేయాలన్నారు. రింగ్ రోడ్‌ను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలన్నారు.