Jagan Tribute at YSR: దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలో వై.ఎస్.ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఉదయం 8.30 గంటల సమయంలో ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్న సీఎం జగన్, తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతోపాటు భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైకాపా నాయకులు ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. సమాధిపై షర్మిల, జగన్ వేర్వేరుగా పూలమాల నివాళులు అర్పించారు. అరగంట పాటు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తన నాన్న భౌతికంగా దూరమైనా ఆయన జ్ఞాపకాలు అలానే నిలిచివున్నాయని అన్నారు. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించారని గుర్తు చేశారు. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని చాటిచెప్పారన్నారు. ప్రతి అడుగులో నాన్నే స్ఫూర్తిగా ఇకపైనా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.