CLAP PROGRAM: వైఎస్సార్ జిల్లాలో 'క్లీన్ ఆంధ్రప్రదేశ్-క్లాప్' కార్యక్రమం అస్తవ్యస్థంగా తయారైంది. నగరపాలకసంస్థ పరిధిలోని 67 సచివాలయాల్లోనే అమలవుతోంది. నెలకు 35 లక్షల రూపాయలు చెత్త పన్ను వసూలు కావాల్సి ఉండగా 8 లక్షలు మాత్రమే వసూలవుతుండం.. అధికారుల అంచనాలను తలకిందులు చేసింది.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ అంటూ మార్చి 1న వైఎస్సార్ నగరపాలక సంస్థ పరిధిలో క్లాప్ పథకం ప్రారంభించారు. వైఎస్సార్ నగరపాలక సంస్థ పరిధిలో 100 సచివాలయాలు పని చేస్తున్నాయి. వీటి పరిధిలో దాదాపు.. 95 వేల నివాస గృహాలున్నాయి. వాటి నుంచి చెత్త సేకరణకు రిక్షాల స్థానంలో.. ఆటోలను ప్రవేశపెట్టారు. తడి, పొడి చెత్త వేరుగా సేకరిస్తామని అధికారులు ప్రకటించారు. ఆటోల రాకతో వైఎస్సార్ నగరపాలికలో ఎప్పట్నుంచో పనిచేస్తున్న.. 120 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని అధికారులు తొలగించారు. మిగిలిన కార్మికుల్లో 200 మందిని ఆటోలకు వినియోగించుకుంటున్నారు. రిక్షా కార్మికులు రోజుమార్చిరోజు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేవారు. ఆటోలువచ్చాక వారం రోజులకు ఒకసారి రావడమే గగనమైందనే విమర్శలున్నాయి.వైఎస్సార్ జిల్లాలో 50 డివిజన్లుంటే రెండు, మూడు డివిజన్లకు కలిపి ఒక్కో ఆటో కేటాయించడం వల్లే ఈ పరిస్థితికి కారణమంటున్నారు.