CID Checkings in Kadapa: ఉపాధి కోసం మన దేశం నుంచి విదేశాలకు చాలామంది వెళ్తుంటారు. విదేశాలలో పని చేసేందుకు అవసరమైన వీసా రావాలంటే కష్టంగా మారింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వీసా మరింత క్లిష్టంగా ఉంది. ఇదే అవకాశంగా భావించిన ఏజెంట్లు డబ్బుల కోసం నకిలీ వీసాలు సృష్టించి అక్కడకు పంపిస్తున్నారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన ఓ ఏజెంట్‌ను దిల్లీలో పోలీసులు పట్టుకున్నారు. అతనికి సంబంధించిన కార్యాలయం కడపలో ఉండడంతో.. కర్నూలుకు చెందిన సీఐడీ అధికారులు కడపలో తనిఖీలు చేపట్టారు. నకిలీ పాస్‌పోర్టు, వీసాలు సృష్టిస్తున్న కార్యాలయంలోనే కాకుండా.. జేకే ట్రావెల్స్తో పాటు ఏ టు జెడ్ మరికొన్ని ట్రావెల్స్‌లలో తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేసే సమయంలో ట్రావెల్స్‌ను నడిపిస్తున్న ప్రధాన వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో సీఐడీ అధికారులు వెనుదిరిగారు.
గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతానికి వీసాలు దొరకడం చాలా కష్టంగా మారింది. ఈ మేరకు కొంతమంది ఏజెంట్లు ఇదే అదనుగా భావించి.. నకిలీ వీసాలు సృష్టించి ప్రజలను గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు. నకిలీ విసాలు అని తేలడంతో.. అక్కడకు వెళ్లిన బాధితులు నానా అగచాట్లు పడుతున్నారు. వారు ఇబ్బందులు పడుతున్న విషయం సోషల్ మీడియా వేదికలు ఇతర మార్గల ద్వారా బయట పడుతోంది. ఇలా బయటపడటం వల్ల నకిలీ ఏజెంట్ల విషయం బయటకు వచ్చింది.