Chitvel Youth Blood Donation : రక్తదానం చేస్తూ.. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు కడప జిల్లా చిట్వేల్ యువత. సమాజ హితం కోసం బతుకుతూ, మరణించిన తర్వాత కూడా ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వగలడం అపూర్వం అంటున్నారు. అన్నదానం వల్ల కొంతమందికి ఆకలి తీరుతుంది.. అదే రక్తదానం చేస్తే ఎన్నో జీవితాలే నిలబడుతాయంటున్న యువతపై ప్రత్యేక కథనం.
రక్తదానం చేద్దాం.. రక్తం కొరతలేని సమాజాన్ని సృష్టిద్దాం అంటున్నారు కడప జిల్లా చిట్వేల్ మండల యువత. గ్రామ గ్రామాన రక్తదానం ప్రాముఖ్యతను వివరిస్తూ.. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలు నిలిపేందుకు తమ సాయశక్తులా కృషి చేస్తున్నారు. 1990 లో అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్ మొదలు పెట్టిన ఈ కార్యక్రమం నేటికి అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. తాను రక్తదానం చేస్తూ.. తన కుటుంబసభ్యులు, మిత్రులతో పాటు మండలంలోని యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు వేణుగోపాల్. వేణుగోపాల్ ఇప్పటి వరకు 99 సార్లు రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టడమే కాకుండా.. యువతకు ఆదర్శంగా నిలిచారు.
" గత 30సంవత్సరాలుగా రక్తదానం చేస్తున్నాను. నాతోపాటుగా దాదాపు 350మంది చిట్వేల్ యువత రక్తదాతలుగా మారారు. రక్తదానం అనేది మనం బతుకుతూ.. మరొకర్ని బతికించే అరుదైన అవకాశం. రక్తదానంతో మనకు కూడా చాలా మేలు జరుగుతుందని యువత గ్రహిస్తే మరింత మంది రక్తదాతలుగా మారే అవకాశం ఉంది. " -వేణుగోపాల్, రక్తదాత.
ఇదీ చదవండి :Pigeons Betting: పావురాలను తీసుకొచ్చారు.. గాల్లో ఎగురవేశారు.. ఎందుకు ?