మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఇవాళ ఐదుగురు అనుమానితులను విచారించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి, మాజీ కారు డ్రైవర్ దస్తగిరి, పులివెందులకు చెందిన నాగప్ప, వివేకా ఇంట్లో పనిచేసే వంటమనిషి, లక్ష్మీదేవి, పనిమనిషి లక్ష్మమ్మలను సీబీఐ అధికారులు విచారించారు. దాదాపు ఆరు గంటల పాటు ఐదుగురిని విచారించారు. హత్య జరిగిన రోజు ముందుగా వివేకా ఇంటికి వెళ్లింది పీఏ కృష్ణారెడ్డే అని సీబీఐ అధికారులకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఐదుగురిని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం.
గోప్యంగా కొనసాగుతోంది..
కడప కేంద్ర కారాగారంలో నెల రోజుల నుంచి సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా శుక్రవారం వివేకానంద రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డితో పాటు పులివెందులకు చెందిన ఉమామహేశ్వర్, మాజీ డ్రైవర్లు దస్తగిరి, ప్రసాద్‌తో పాటు మరో వ్యక్తిని సీబీఐ అధికారులు విచారించారు. వీరి నుంచి సీబీఐ అధికారులు పలు కీలక అంశాలను రాబట్టారు. కేసు విచారణ మొత్తం అతికొద్దిమంది చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను అధికారులు నమోదు చేసుకున్నారు. విచారణ మొత్తం అత్యంత గోప్యంగా కొనసాగుతోంది.