కడప జిల్లాను పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి 2007లో చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి వద్ద ఏపీఐఐసీ ద్వారా ఏడు వేల ఎకరాలను సేకరించారు. ఇప్పటివరకు ఆరు చిన్న పరిశ్రమలు మినహా... పెద్ద కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కాలేదు. దాదాపు దశాబ్ధ కాలం పాటు కొప్పర్తి పారిశ్రామికవాడ నిర్మానుష్యంగా ఉంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం... సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో కొప్పర్తి పారిశ్రామికవాడ అభివృద్ధి దస్త్రాలు చకచకా కదులుతున్నాయి.
'నిక్ డిట్' సముఖత
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన.. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్టు(నిక్ డిట్) ఆధ్వర్యంలో కొప్పర్తి పారిశ్రామికవాడలో వెయ్యి కోట్ల రూపాయలతో కారిడార్‌ను అభివృద్ధి చేయడానికి సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో నిక్ డిట్ సంస్థ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తుండగా... ఏపీలో కడప, నెల్లూరు జిల్లాల్లో అభివృద్ధి చేయడానికి సుముఖత చూపినట్లు సమాచారం.
కేంద్రానికి ప్రతిపాదనలు
కొప్పర్తి పారిశ్రామికవాడలో వెయ్యి ఎకరాల్లో రహదారుల విస్తరణ, మంచినీరు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. చెన్నై-విశాఖ కారిడార్ అభివృద్ధిలో భాగంగా కొప్పర్తిలో మరో 3 వేల ఎకరాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. వీటితోపాటు బెంగళూరుకు చెందిన "నేషనల్ ఏరో స్పేస్ ల్యాబొరేటరీ" సంస్థ కూడా కొప్పర్తిలో అడ్వాన్స్ టెక్నాలజీతో కాంపోజిట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. ఈ పరిశ్రమ ఇక్కడ వస్తే... విమానాలు, హెలికాప్టర్లకు వాడే అల్యూమినియం ప్లేట్లు, విడి భాగాలను చాలా తక్కువ బరువుతో తయారు చేయడానికి కాంపోజిట్ టెక్నాలజీ పరిశ్రమ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఏపీఐఐసీ ఆద్వర్యంలో రూ.200 కోట్లతో కొప్పర్తిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించారు. దీనిద్వారా జిల్లాలోని మామిడి, అరటి, బత్తాయి, బొప్పాయి, జామ, దానిమ్మ వంటి పళ్లను రైతులు ప్రాసెసింగ్ చేసుకుని విక్రయించుకునే విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది.