ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని యురేనియం కర్మాగారం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఏళ్ల తరబడి యురేనియం కాలుష్యం వల్ల ఆరు గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఎం జగన్ స్వయంగా వెళ్లి పరిశీలించాలని సూచించారు. కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం వల్ల నష్టపోతున్న ఆరుగ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అఖిలపక్షం నాయకులు కేకే కొట్టాల గ్రామంలో పర్యటించారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యాలకు గురవుతున్నా, పంటలు నష్టపోతున్నా తమను ఎవరూ పట్టించుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం స్పందించకపోతే.. జాతీయస్థాయిలో ఉద్యమం: అఖిలపక్షం - బాధిత గ్రామాల్లో అఖిలపక్షం నేతల పర్యటన
యురేనియం బాధిత గ్రామాల్లో సీఎం జగన్ పర్యటించాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. సీఎం తన సొంత నియోజకవర్గంలోని ప్రజల బాధలను పట్టించుకోవటం లేదని వారు ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోతే జాతీయ ఉద్యమంగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

అఖిలపక్ష సమావేశానికి తెదేపా, సీపీఐ, సీపీఎం, జనసేన, ఆమ్ ఆద్మీతోపాటు ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం యురేనియం టెయిల్ పాండును పరిశీలించింది. నిబంధనలకు విరుద్ధంగా కనీస జాగ్రత్తలు లేకుండా టెయిల్ పాండు నిర్మించారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. దక్షిణ భారతదేశంలోనే తొలి యురేనియం ప్రాజెక్టును నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి ఏమి ఆశించి తెచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూడా జరుగుతున్న యురేనియం సర్వేను అడ్డుకుంటామని భూమా అఖిలప్రియ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోతే జాతీయ ఉద్యమంగా తీసుకెళ్తామని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. అలాగే తెలంగాణలోనూ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడతామని పేర్కొన్నారు.