PENSION STOPPED TO FAMILY FOR MORE POWER BILL: ఆ ఇంట్లో ఇద్దరు వృద్ధ దంపతులు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నా.. చిన్నవయసులోనే కండరాల క్షీణత వ్యాధికి గురై ఏ పనీ చేయలేకున్నారు. దీంతో.. ఆ వృద్ధులే.. జీవనోపాధి కోసం శీతలపానియాలు అమ్ముకుంటున్నారు. దీనికితోడు.. ప్రభుత్వం ఇచ్చే పింఛను సొమ్ము వారికి ఆసరాగా ఉంటోంది. అయితే.. ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న శీతలపానీయాల దుకాణాన్ని కారణంగా చూపుతూ.. పింఛన్ నిలిపేశారు అధికారులు.
కడప జిల్లా కాజీపేటలోని షేక్ నూరుద్దీన్ కుటుంబం దీనగాథ ఇది. షేక్ నూరుద్దీన్, రబియాబి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆరోగ్యంగా ఉన్న కుమార్తెలకు వివాహం చేశారు. పెద్ద కుమారుడు రియాజ్ 15 ఏళ్ల వయసులో, రెండో కుమారుడు ఇంతియాజ్ పదహారేళ్ల వయసులో కండరాల క్షీణత సమస్యతో ఇంటికే పరిమితమయ్యారు.
దీంతో.. ప్రభుత్వం అందించే పింఛను సహాయంతోనే వారి కుటుంబం నడుస్తోంది. అయితే.. శీతలపానీయాల దుకాణానికి.. విద్యుత్ బిల్లు అధికంగా వస్తోందన్న కారణంతో.. వారు ధనవంతులుగా భావించారో ఏమో.. వారికి వచ్చే పింఛను నిలిపేశారు అధికారులు.