వాహనాల తనిఖీల్లో.. 6 కిలోల బంగారం పట్టివేత - 6kg
ఎన్నికల అనంతరం కూడా పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో భారీగా అక్రమ బంగారం వెలుగుచూస్తోంది. తాజాగా కడప జిల్లాలో సుమారు 6 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లా ఎర్రగుంట్లలోని వై. జంక్షన్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో.. సుమారు 6 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ద్విచక్రవాహనంలో తరలిస్తున్న 5 కేజీల 700 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఆ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. బంగారం విలువ సుమారు కోటి 86 లక్షల 69 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. చెన్నై నుంచి కడప జిల్లా ప్రొద్దుటూరుకి బంగారాన్ని తీసుకెళ్తుండగా పట్టుకున్నామని ఎర్రగుంట్ల సీఐ వివరించారు.