woman murder case: కడప జిల్లా పోరుమామిళ్లలో ఈ నెల 28వ తేదీ జరిగిన మహిళ హత్య కేసులో 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు, నలుగురు మహిళలు ఉన్నారు. పోరుమామిళ్లకు చెందిన మున్నీపై అదే ప్రాంతానికి చెందిన మాబు హుస్సేన్‌కు చెందిన బంధువులు దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
మహిళ హత్య కేసులో 12 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిందితుల వివరాలను ఎస్పీ వెల్లడించారు. ‘ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన షేక్ మున్నీ పోరుమామిళ్లలోని ఓ సూపర్‌మార్కెట్‌లో గత ఆరు నెలల నుంచి పని చేసేది. పోరుమామిళ్లకు చెందిన పఠాన్ మాబుహుస్సేన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో ఆ కుటుంబంలో గొడవలు జరుగుతుండేవి. పఠాన్ మాబుహుస్సేన్ తండ్రి మహబూబ్‌బాషా తనకు తెలిసిన బి.కోడూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జిలానీబాషాతో మాట్లాడారు. తన కుమారుడు ఇంటికి రావడం లేదని ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చేలా చూడాలని కోరారు. జిలానీబాషా కలసపాడులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్‌తో కలిసి గురుప్రసాద్ కారును అద్దెకు తీసుకుని గిద్దలూరుకు వెళ్లారు. ఆమెను బలవంతంగా కారులో పోరుమామిళ్లకు తీసుకొచ్చారు. 12 మంది కలిసి దాడి చేయడంతో షేక్ మున్నీ అపస్మారకస్థితిలోకి చేరుకుంది. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చూపించి అక్కడనుంచి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు.