గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా మేయర్ అభ్యర్థి ఎవరు? అధికార వైకాపాలో ఇప్పుడు ఇదే చర్చ. మొత్తం 57 డివిజన్లన్న గుంటూరు నగరపాలిక....ఈసారి మేయర్ పదవి జనరల్‌కు కేటాయించడంతో పోటీ తీవ్రమైంది. మేయర్‌గిరీపై 20వ డివిజన్ అభ్యర్థి కావటి మనోహర్ నమ్మకంతో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున రెండుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికైన మనోహర్ నాయుడు...వైకాపా యువజన విభాగంలోనూ పనిచేశారు. 2014, 2019లో వైకాపా తరఫున పెదకూరపాడు అసెంబ్లీ స్థానం ఆశించినా...... టికెట్ దక్కలేదు. న్యాయం చేస్తామని పార్టీ పెద్దలు నచ్చజెబుతూ వస్తున్నారు. ఈసారైనా తనకు న్యాయం జరుగుతుందని మనోహర్ ఆశిస్తున్నారు. పురపాలకశాఖ మంత్రి బొత్స ఆశీస్సులు ఉండటం.... తనకు అదనపు బలమని భావిస్తున్నారు.
వైకాపా నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పాదర్తి రమేశ్ గాంధీ....6వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా బరిలో నిలిచారు. జిల్లాలోని ముఖ్య నేతలందరినీ కలిసి... మేయర్‌గా బలపర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సామాజిక సమీకరణలూ కలిసొస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఐతే... అదే సామాజికవర్గం నుంచి తెలుగుదేశం తరఫున గెలిచిన ఎమ్మెల్యే మద్దాలిగిరి... ప్రస్తుతం వైకాపాలో తిరుగుతుండటం.... రమేశ్ గాంధీకి ప్రతికూలంగా మారొచ్చన్నది విశ్లేషకుల మాట.