ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా అధినేత ఇంటిపై దాడి యత్నం... కర్రలు, రాళ్లతో టీడీపీ, వైసీపీ నేతల పరస్పర దాడులు - TDP president chandhrababu naidu

కృష్ణా నది తీరంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తెదేపా అధినేత చంద్రబాబు నివాస ప్రాంతం శుక్రవారం రణరంగాన్ని తలపించింది. అధికార పార్టీకి చెందిన పెడన శాసనసభ్యుడు జోగి రమేష్‌ పెద్దసంఖ్యలో తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి, జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు రావడం, ఆ సందర్భంగా కర్రలు, రాళ్లతో వైకాపా, తెదేపా నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు దిగడం, పోలీసుల లాఠీఛార్జితో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాళ్ల దాడి, లాఠీఛార్జిలో పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలు, కొందరు మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. కొందరు వైకాపా కార్యకర్తలకూ దెబ్బలు తగిలాయి. దాడి జరుగుతున్న సమయంలో ఆయన తన నివాసంలోనే ఉన్నారు.

తెదేపా అధినేత ఇంటిపై దాడి యత్నం
తెదేపా అధినేత ఇంటిపై దాడి యత్నం

By

Published : Sep 18, 2021, 4:07 AM IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు... ముఖ్యమంత్రి జగన్‌, హోం మంత్రి సుచరిత తదితరులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ, దానికి నిరసనగా చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు జోగి రమేష్‌ ప్రయత్నించారు. ఆయన, వైకాపా కార్యకర్తలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుమారు 15-20 వాహనాలతో కృష్ణా కరకట్ట పైకి వచ్చారు. చంద్రబాబు ఇంటి సమీపానికి రాగానే వాహనాలు ఆపి... కర్రలకు అమర్చిన పార్టీ జెండాలు పట్టుకుని వైకాపా కార్యకర్తలు, రమేష్‌ అనుచరులు దిగి, చంద్రబాబు ఇంటి వైపు దూసుకెళ్లారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి వెళుతున్న విషయాన్ని కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులకు రమేష్‌ ముందే తెలియజేశారు.

విషయం తెలియడంతో...

ఆ సమయానికి తెదేపా కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పట్టాభిరామ్‌, నాగుల్‌మీరా తదితర నాయకులు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. రమేష్‌ వాహనశ్రేణి చంద్రబాబు ఇంటివరకు వచ్చిందని తెలియడంతో... వారంతా కరకట్టపై ఉన్న ప్రధాన బారికేడ్‌ వద్దకు వచ్చారు. జోగి రమేష్‌ వాహనాన్ని చంద్రబాబు నివాసం వైపు మళ్లించడంతో... తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబు ఇంటిని ఎలా ముట్టడిస్తారని, వెనక్కి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెదేపా నాయకుడొకరు జోగి రమేష్‌ వాహనం అద్దంపై బలంగా కొట్టారు. వెంటనే రమేష్‌ కిందకు దిగారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆయనకు నచ్చజెప్పి వెనక్కి పంపేందుకు బుద్దా వెంకన్న లాంటివారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైకాపా కార్యకర్తలు తమ జెండాకర్రలతో తెదేపా కార్యకర్తలపై దాడికి దిగారు. వాళ్ల చేతిలో కర్రలు లాక్కుని తెదేపా నాయకులూ ఎదురుదాడి చేశారు. తర్వాత పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

చంద్రబాబు ఇంటివద్ద ఘర్షణ జరుగుతున్న విషయం తెలిసి... రాజధాని గ్రామాలకు చెందిన పలువురు తెదేపా మద్దతుదారులు, మహిళలు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయానికి అక్కడ చంద్రబాబు రక్షణ కోసం రోజువారీ విధుల్లో ఉండే పోలీసులు తప్ప ఇంకెవరూ లేరు. ఘర్షణ మొదలైన తర్వాత అరగంటకు తాడేపల్లి, మంగళగిరి పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలనూ చెదరగొట్టారు. తెదేపా నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు ఇంటివైపు తరిమికొట్టారు. ఆ క్రమంలో బుద్దా వెంకన్న కింద పడిపోయారు. ఆయన సొమ్మసిల్లడంతో... సహచరులు చెట్ల నీడలో పడుకోబెట్టి సపర్యలు చేయగా తేరుకున్నారు. డూండీ రాకేష్‌, జంగా సాంబశివరావు తదితర తెదేపా నాయకులకు గట్టి దెబ్బలు తగిలాయి. రాళ్లు తగలడంతో ఒకరిద్దరికి రక్తం కారింది. ఈటీవీ కెమెరామన్‌ నాగరాజుకి రాయి తగిలి గాయమైంది. కొందరికి చొక్కాలు చిరిగిపోయాయి. గంటన్నరపాటు అక్కడ ఘర్షణ వాతావరణం కొనసాగింది. చివరకు పోలీసులు జోగి రమేష్‌ను అరెస్టు చేసి మంగళగిరి పోలీసుస్టేషన్‌కు తరలించడంతో వివాదం సద్దుమణిగింది. రమేష్‌ను పోలీసులు సుమారు గంటసేపు పోలీసు స్టేషన్‌లో ఉంచి పంపేశారు.

ఏ1 జగన్‌, ఏ2 డీజీపీ: పట్టాభి

చంద్రబాబు నివాసం వద్ద తెదేపా నేత పట్టాభి మాట్లాడుతూ... జోగి రమేష్‌ దాడికి వస్తున్నట్లు పోలీసులకు ముందే తెలుసని, ఆయన కాన్వాయ్‌కి గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటుచేసి మరీ పోలీసులు చంద్రబాబు ఇంటి దగ్గరకు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడికి అంతమంది వస్తే ఎందుకు అడ్డుకోలేదని మండిపడ్డారు. ‘ఇదంతా కుట్ర ప్రకారమే జరిగింది. దీనిలో ఏ1 ముద్దాయి జగన్‌, ఏ2 డీజీపీ, ఏ3 జోగి రమేష్‌’ అని ఆయన ధ్వజమెత్తారు.

తాడేపల్లి పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

దాడిపై ఫిర్యాదు చేసేందుకు తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. వారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు స్టేషన్‌ గేట్లు మూసేసి ముఖ్య నాయకులనే లోపలికి అనుమతించారు. తెదేపా కార్యకర్తలు దాదాపు గంటపాటు పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. తెదేపా నాయకులు మూడు ఫిర్యాదులు చేశారు. జోగి రమేష్‌, ఆయన అనుచరులు 30 మంది... తమ నాయకుడు చంద్రబాబుతో పాటు, తమను చంపుతామని బెదిరించడమే కాకుండా, కర్రలతో దాడి చేశారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఫిర్యాదుచేశారు. ‘డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సపోర్టు మాకుంది. ఈ రోజు చంద్రబాబు, లోకేశ్‌ అడ్డు వచ్చినా... చంపి ఇంటికి వెళతామని జోగి రమేష్‌, ఆయన అనుచరులు పెద్దగా అరుస్తూ, బెదిరించారు. చంద్రబాబును రక్షించేందుకు వారిని నిలువరించే ప్రయత్నం చేయగా... కర్రలు, రాళ్లతో కొట్టారు. అక్కడ ఉన్న పోలీసులు వారిని ఆపకుండా, మాపై లాఠీఛార్జి చేశారు. దౌర్జన్యంగా వచ్చిన వైకాపా నాయకులకు సహకరించారు. చంద్రబాబును చంపడానికి వచ్చిన జోగి రమేష్‌, ఆయన అనుచరులు 30 మందిపై, వారిని ప్రోత్సహించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోండి’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

*జోగి రమేష్‌, ఆయన అనుచరులు చంద్రబాబు నివాసం వద్ద గొడవ చేస్తున్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లి ప్రశ్నించిన తనపై వారు దాడిచేశారని, చంద్రబాబుతో పాటు తననూ చంపుతామని బెదిరించారని తాడేపల్లి పట్టణ తెదేపా అధ్యక్షుడు జంగాల సాంబశివరావు పోలీసులకు మరో ఫిర్యాదుచేశారు. వారు జెండాకర్రతో కొట్టడంతో తలకు గాయమై రక్తం కారిందని, చొక్కా, బనీను చిరిగిపోయాయని పేర్కొన్నారు.

జోగి రమేష్‌ కారు డ్రైవర్‌ ఫిర్యాదు

రమేష్‌పై తెదేపా నాయకులు దాడి చేశారంటూ ఆయన కారు డ్రైవర్‌ రాము ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో ఏం పేర్కొన్నారో చెప్పాలని సీఐ శేషగిరిరావుని కోరగా... ఆ వివరాలు తన వద్దకు రాలేదని ఆయన బదులిచ్చారు.

హోరెత్తిన కరకట్ట

చంద్రబాబు ఇంటి దగ్గరకు వెళ్లనివ్వకుండా తెదేపా నాయకులు తనను కరకట్టపైనే అడ్డుకోవడంతో జోగి రమేష్‌ అక్కడే నేలపై బైఠాయించారు. ఆ సందర్భంగా వైకాపా, తెదేపా కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. సీఐని సస్పెండ్‌ చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు.

సీఎంని చంద్రబాబు క్షమాపణ కోరాలి: జోగి రమేష్‌

పోలీసులు అరెస్టు చేయడానికి ముందు జోగి రమేష్‌ మాట్లాడుతూ... చంద్రబాబు ప్రోద్బలంతోనే అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రిపై అభ్యంతరకరంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ‘ప్రజలు ఆరాధ్యుడిగా చూస్తున్న జగన్‌ గురించి అయ్యన్నపాత్రుడు నీచంగా మాట్లాడారు. అయ్యన్న లాంటి వాళ్లను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. దానిపై నిరసన తెలియజేయడానికే ఇక్కడికి వచ్చాం. ముఖ్యమంత్రికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. అంతవరకూ చంద్రబాబును, ఆయన కుమారుడిని తిరగనివ్వం’ అని హెచ్చరించారు.

చంద్రబాబు నివాసానికి వెళ్లకుండా అడ్డంకులు

తెదేపా నాయకులను చంద్రబాబు ఇంటివైపు వెళ్లకుండా ప్రకాశం బ్యారేజీ దగ్గర, ఉండవల్లి గుహల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో జోగి రమేష్‌కి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ అతికించిన కారు అటు వైపు రావడంతో... తెదేపా నాయకులు దానిపై చెప్పులు, రాళ్లతో దాడిచేశారు. అనంతరం ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, తెనాలి శ్రావణ్‌కుమార్‌ తదితర నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు బయటకు వచ్చి వారిని కలిశారు.

ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే దారుల్లో కట్టుదిట్టమైన భద్రత

చంద్రబాబు ఇంటి దగ్గర ఘర్షణ అనంతరం... తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌ నివాసం, క్యాంపు కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్ని పోలీసులు బారికేడ్లు పెట్టి మూసేశారు. జాతీయ రహదారి నుంచి తాడేపల్లి వైపు, తాడేపల్లి ఊళ్లోంచి జాతీయ రహదారి వైపు వచ్చే మార్గాల్లో సాధారణ ప్రజల వాహనాలను అనుమతించలేదు.

ABOUT THE AUTHOR

...view details