ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Woman Code to Win Contest: సవాళ్లతో సావాసం.. అదే ఆమె విజయ మంత్రం - జెఈఈ మెయిన్స్

Woman Code to Win Contest : ఓవైపు ఆరోగ్య సమస్యలు మరోవైపు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు..ఇవేవి ఆ యువతి ప్రతిభకు అడ్డుకాలేదు. అవే ఆమెకు పోరాట స్ఫూర్తిని రగిలించాయి.ఎలాగైనా ఉన్నత లక్ష్యం చేరుకోవాలనే కసిని మరింత పెంచాయి. ఆ తపనే గుంటూరు జిల్లాకు చెందిన కర్రి డనీషాను జీవితంలో ఊహించని వేతనం ఇచ్చే కొలువులకు చేరువ చేశాయి. సర్వీస్‌ నౌ సంస్థ నిర్వహించిన ‘ఉమెన్‌ కోడ్‌ టూ విన్‌’ కాంటెస్ట్‌-2022లో దేశంలోనే తొలిస్థానంలో నిలిచేలా చేశాయి.

Woman Code to Win Contest
సవాళ్లతో సావాసమే ఆమె విజయ మంత్రం...

By

Published : Feb 18, 2022, 8:26 AM IST

సవాళ్లతో సావాసమే ఆమె విజయ మంత్రం...

Woman Code to Win Contest Winner: ఉమెన్‌ కోడ్‌ టూ విన్‌ కాంటెస్ట్‌-2022..! సర్వీస్‌ నౌ సంస్థ నిర్వహించిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర విద్యా సంస్థలకు చెందిన 4,500 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కినెట్టి విజేతగా నిలిచింది గుంటూరు జిల్లా మెుల్లగుంట గ్రామానికి చెందిన కర్రి డనీషా. కేఎల్‌ వర్సిటీలో బీటెక్ చేస్తున్న డనీషా తండ్రి.. మ్యారేజ్‌ బ్యూరో నిర్వహిస్తుండగా, తల్లి మధ్యాహ్న భోజన పథకంలో కార్మికురాలుగా పని చేస్తున్నారు. డనీషా చదువు కోసం చిన్నతనంలోనే మకాం హైదరాబాద్‌కు మార్చారు. థైరాయిడ్‌, అస్తమాతో ఇబ్బంది పడుతూనే డనీషా... పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేసింది.

మాది రేపల్లె దగ్గర మొల్లగుంట అనే చిన్నపల్లె. నాన్న గతంలో చేపలు అమ్మేవారు. ప్రస్తుతం ఓ మ్యారేజ్‌బ్యూరో నడుపుతున్నారు. అమ్మ బడి పిల్లల మధ్యాహ్న భోజన పథకంలో కార్మికురాలు. వాళ్ల రెక్కల కష్టంతోనే నన్ను చదివించారు. నాకో అన్నయ్య. మా మేనమామలు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. ‘పిల్లలకు మంచి చదువు అందాలంటే హైదరాబాద్‌ బాగుంటుంది’ అని వాళ్లు పదే పదే చెప్పేవారు. దాంతో మేం హైదరాబాద్‌ వచ్చాం. అమ్మ మాతోపాటు ఉండి స్కూల్లో పిల్లలకు వంటలు చేస్తూ ఆ వచ్చే జీతంతో మమ్మల్ని పోషించేది. నాకు ఐదో ఏట థైరాయిడ్‌ సమస్య వచ్చింది. ఆ తర్వాత ఆస్తమా చుట్టుముట్టింది. ఆర్థిక కారణాలతో వాటికి చికిత్స చేయించుకోలేక పోవడంతో తర్వాత అవి తీవ్రమయ్యాయి. బాగా బరువు పెరిగిపోయా. కళాశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా అనిపించేది. ఎక్కువ సేపు కూర్చో లేకపోయేదాన్ని. 65 కేజీల బరువు ఉండాల్సిందాన్ని 105 కేజీలు ఉన్నా. మా చదువులకీ, నా చికిత్సలకీ నాన్న రూ.లక్షల్లో అప్పులు చేశారు. అవి తీరే మార్గం కనిపించలేదు. ఆ ఇబ్బందుల మధ్యే ఇంజినీరింగ్‌ విద్యకు సిద్ధమయ్యా. -డనీషా

రూ.44 లక్షల ప్యాకేజీతో...

ఇంటర్‌ అయ్యాక జేఈఈ మెయిన్స్‌ రాశాను. ట్వంటీ పర్సంటైల్‌తో దిల్లీలో ఉచిత సీటొచ్చింది. కానీ ఏం లాభం? అనారోగ్యంతో ఒక్కదాన్నీ దిల్లీలో ఉండటానికి భయపడ్డా. దాంతో బ్యాంకు నుంచి రూ.7 లక్షల అప్పు తీసుకుని గుంటూరులోని కేఎల్‌ వర్సిటీలో చేరా. ఇక్కడ చేరడం ఆలస్యం కావడంతో నాకు రావాల్సిన ఉపకారవేతనాన్ని కోల్పోయా. ఈ అప్పులు, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే ఎంత కష్టమైనా సరే బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాల్సిందేనని ఇంజినీరింగ్‌లో అడుగుపెట్టే ముందే గట్టిగా అనుకున్నా. అలా ఒక కసితో చదవటం వల్లేనేమో దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘విమెన్‌ కోడ్‌ టు విన్‌’ పరీక్షలో ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థినులను కూడా వెనక్కు నెట్టి మొదటి ర్యాంకు సాధించా అనిపిస్తోంది. అమెరికాకు చెందిన ‘సర్వీస్‌ నౌ’ సంస్థ ఈ పరీక్షలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా బీటెక్‌, ఎంటెక్‌ చదివే 4500 మంది అమ్మాయిలు ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష రాయగా నాకు మొదటి ర్యాంకు రావటం చాలా సంతోషంగా అనిపించింది. టాప్‌-8 ర్యాంకర్లలో నేను మినహా మిగిలిన వారంతా ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థినులే. గంటన్నర పరీక్షను కేవలం 35-40 నిమిషాల సమయంలోనే పూర్తి చేయగలిగాను. ప్రస్తుతం బీటెక్‌ (సీఎస్ఈ) మూడో సంవత్సరం చదువుతున్నా. ఈ పోటీలో విజేతగా నిలవడంతో అమెజాన్‌, అడోబ్‌ వంటి బహుళ జాతి సంస్థలు రెండు నెలల ఇంటర్న్‌షిప్‌కు ఆహ్వానించాయి. శిక్షణలో రూ.లక్ష రూపాయలు అందిస్తామన్నారు. శిక్షణ తర్వాత రూ.44 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు ఇస్తామని చెప్పారు. ఏ సంస్థలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఏదైనా ఇంతవరకూ మాకోసం కష్టపడిన అమ్మానాన్నలకి విశ్రాంతినివ్వాలని ఉంది. -డనీషా

ఇదీ చదవండి :NEET MDS 2022 Postponed: 'నీట్‌ ఎండీఎస్‌ పరీక్ష 4-6 వారాలు వాయిదా'

"కళాశాల సబ్జెక్టులతో పాటుగా కోడింగ్ ను కూడా నా జీవితంలో అలవాటుగా మార్చుకున్నాను. దాని వల్లనే నేను ఈ రోజు మొత్తం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాను. నాకు అమెజాన్, అడోబి వంటి సంస్థల నుంచి పిలుపు వచ్చింది. నేను ఇంత సాధించడానికి కారణం నా కుటుంబం. అన్నయ్య కూడా కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉండటంతో ఇద్దరం కలిసి ఓ సాఫ్ట్ వేర్ సంస్థ పెట్టాలన్నదే మా లక్ష్యం" -డనీషా, ఇంజినీరింగ్ విద్యార్థి

"మా చెల్లి చిన్నప్పటి నుంచే కోడింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తితోనే ధైర్యంగా పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె మున్ముందు ఇంకా మరింతగా ఎదగాలని కోరుకుంటున్నాను" - శ్రీనివాసరావు, డనీషా సోదరుడు

సోదరుడు శ్రీనివాసరావు ప్రోత్సాహంతో కోడింగ్‌పై ఆసక్తి కలిగిందని పేర్కొన్న డనీషా... తల్లిదండ్రులు, బంధువుల సహకారంతోనే ఈ ఘనత సాధించినట్లు తెలిపింది.

ఇదీ చదవండి :

TTD BUDGET: తితిదే బడ్జెట్ 3,096 కోట్లు...త్వరలో ఆర్జిత సేవల పునరుద్ధరణ

ABOUT THE AUTHOR

...view details