సరైన అనుమతులు లేని భవనాలను ప్రజావేదికతో ప్రారంభించి అన్నింటినీ కూల్చాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో జగన్ ఆదేశించారు. దీనికనుగుణంగా ప్రజావేదిక నేలమట్టం 24గంటల్లోనే యుద్ధప్రాతిపదికన అధికారులు పూర్తి చేశారు. నవ్యాంధ్రలో రాజధాని అభివృద్ధిలో భాగంగా చేపట్టిన నిర్మాణాల్లో కూల్చివేసిన తొలి భవనంగా ప్రజావేదిక చరిత్రకెక్కింది. ప్రజావేదిక పక్కనే ఉన్న చంద్రబాబు నివాసంతో పాటు కరకట్ట వెంబడి అనేక నిర్మాణాలు వెలిశాయి. వాటి పట్ల ప్రభుత్వ చర్యలు ఇంతే వేగంగా ఉంటాయా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఆక్రమణల చిట్టా చాలానే ఉంది
కరకట్ట రహదారి ప్రారంభంలో మొదట వచ్చే నిర్మాణం గణపతి సచ్చిదానంద స్వామిది. అందులోనే ఇటీవల తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ తమ గురువు స్వరూపానందకు సన్మానం చేశారు. ఆ వెంబడి ఇస్కాన్ ఆలయంతో పాటు చిన్నా చితకా భవనాలు ఉన్నా.... తర్వాత వచ్చే కట్టడం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అతిథి గృహం. చంద్రబాబు నివసిస్తున్న భవనం నుంచి కొంచెం ముందుకు వెళితే వచ్చేది చిగురు పాఠశాల. దాని వెంబడి మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ఆశ్రమం. ఇవన్నీ భారీ కట్టడాలే. ఆ తర్వాత శివస్వామి అశ్రమం వంటివి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉంది. వీటి జోలుకి ప్రజావేదిక మీదకి వెళ్లినంత వేగంగా అధికారులు ఏ మేర వెళ్తారన్నది ప్రశ్నార్థకం. అయితే వీటన్నింటికీ కోర్టు స్టే ఇచ్చి ఉన్నందున అది తేలే వరకూ వీటి జోలుకు వెళ్లే అవకాశం ఉండదని తెలుస్తోంది.
అక్రమ కట్టడాలపై దూకుడు కొనసాగేనా? - demolish
అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తాం అని ముఖ్యమంత్రి ప్రకటించిన కొన్ని గంటల్లోనే ప్రజావేదిక నేలమట్టమయింది. ఇప్పుడు తదుపరి చర్య దేనిమీదనే చర్చ సర్వత్రా సాగుతోంది. చంద్రబాబు నివాసంతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ బంగ్లా, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ఎన్నో కట్టడాలు అక్రమంగా వెలిశాయని స్పష్టమవుతోంది. మరి వీటిపైన ప్రభుత్వ దూకుడు కొనసాగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వ భవనాలే అధికం
గుంటూరు జిల్లాలో ఉన్న కరకట్ట వెంబడి పరిస్థితి ఇలా ఉంటే విజయవాడ నగరంలోను ఇంతకు మించిన అక్రమ కట్టడాలు అనేకం ఉన్నాయి. విజయవాడలో ప్రధానమైన రైవస్, బందరు కాలువ గట్ల వెంబడి వందలాది కట్టడాలు అక్రమంగా వెలిశాయి. అందులో ప్రభుత్వ శాఖలకు చెందినవీ చాలా ఉన్నాయి. స్వయంగా విజయవాడ పోలీసు కమిషనర్ బంగ్లాతోపాటు, గతంలో ఉడా కార్యాలయం, ప్రస్తుత సీఆర్డీయే కార్యాలయం, విజయవాడ మున్సిపల్ అతిథిగృహం, అనాథలకు ఆశ్రయం ఇస్తున్న నిర్మలా భవన్ కూడా కాలువ గట్టునే నిర్మించారు. పలు అసోసియేషన్లు, పోలీస్ స్టేషన్లు, సివిల్ సప్లయి కార్యాలయం, అగ్నిమాపక శాఖకు చెందిన కట్టడాల్లో అత్యధికం నదీ, పర్యావరణ చట్టాలకు విరుద్ధంగానే ఉన్నాయి. సీఎం ఆదేశాల మేరకు వీటన్నింటినీ అధికారులు నేలమట్టం చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రజావేదిక కూల్చివేత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించిన ప్రభుత్వం ఇక ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ప్రశ్నగా మిగిలింది.