సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. మద్యాన్ని ఆదాయ వనరుగా భావించడంలేదన్న నారాయణస్వామి... ప్రతిపక్షాలు మద్యనిషేధాన్ని నీరుగార్చే ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా కొరిటిపాడులో మద్యం విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యాలయాన్ని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రారంభించారు.
మద్యం నిషేధంతో రోడ్డుప్రమాదాలు తగ్గాయని... జగన్ ప్రభుత్వం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలు కుదుటపడుతున్నాయని చెప్పారు. మద్యం అక్రమ రవాణాకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. మహిళలతో పాటు అన్నివర్గాలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. మద్యనిషేధంతో గ్రామాల్లో మళ్లీ సారా తయారవుతుందని ప్రతిపక్ష నేత చెప్పడం వెనుక మతలబు ఏంటని నిలదీశారు. సారా తయారీని చంద్రబాబు సమర్థిస్తున్నారా అని నారాయణస్వామి ప్రశ్నించారు.