ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TADIKONDA SCHOOL : చదువులమ్మ ఒడిలో వజ్రోత్సవం.. తాడికొండ పాఠశాలకు 75 ఏళ్లు!

TADIKONDA SCHOOL : చదువే తమ ప్రగతికి మూలమని దశాబ్దాల క్రితమే గ్రహించారు ఆ గ్రామస్థులు. తమ ఊరిలో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయాలని సర్కారుని అభ్యర్థించారు. కానీ.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దాంతో.. సొంతగానే హైస్కూల్ ఏర్పాటుకు నడుం కట్టారు. ఒకరు భూమిచ్చారు. మరొకరు భవనం నిర్మాణానికి నిధులిచ్చారు. అలా.. గ్రామస్థుల సంకల్పం ఫలించింది. ఆ పాఠశాలలో చదువుకున్న వేలాది మంది వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అలాంటి చదువులమ్మ ఒడికి 75 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా కలిసి ఉత్సవాలు చేసేందుకు సిద్ధమయ్యారు. అదే.. గుంటూరు జిల్లా తాడికొండ వి.వి.ఉన్నత పాఠశాల!

TADIKONDA SCHOOL
తాడికొండ వి.వి.ఉన్నత పాఠశాల

By

Published : Dec 24, 2021, 6:31 PM IST

తాడికొండ వి.వి.ఉన్నత పాఠశాల

TADIKONDA SCHOOL : చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న పై పాఠశాలకు పెద్ద చరిత్రే ఉంది. యావత్‌ భారత్‌ ఆజాదీకా అమృతోత్సవ్‌ జరుపుకుంటున్న తరుణంలో.. ఈ పాఠశాల కూడా 75 వసంతలు పూర్తి చేసుకుని సంబురాలకు సిద్ధమైంది. సాధారణంగా ఓ పాఠశాల 30-40 ఏళ్ల నడవడమే గొప్ప. అలాంటిది.. 75 ఏళ్ల ప్రస్థానమంటే మాటలు కాదు. మరి ఆ ప్రస్థానం ఎలా మెుదలైందో తెలుసుకోవాలంటే... 1940ల్లోకి వెళ్లాల్సిందే.

ఆ సమయంలో... గుంటూరు జిల్లా తాడికొండలో సరైన విద్యా సౌకర్యాలు లేవు. హైస్కూల్ చదవుల కోసం 20 కిలోమీటర్ల దూరంలోని గుంటూరుకు వెళ్లాల్సిందే. దానికి పరిష్కార మార్గం కోసం అన్వేషించసాగాడు...కనకయ్య అనే యువకుడు. గ్రామ పెద్దలతో సంప్రదింపులు జరిపాడు. అందరూ సరేనన్నారు. మల్లెల రత్తమ్మ అనే మహిళ 600 రూపాయలు విరాళం అందజేశారు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే. మరికొందరు కూడా ముందుకు వచ్చి తలా ఓ చేయి వేశారు. పాఠశాలకు మొదటి విరాళం ఇచ్చిన రత్తమ్మ తండ్రి వెళ్లంకి వెంకటప్పయ్య పేరిట 1942లో ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభమైంది.

గ్రామస్థుల చైతన్యంపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం స్పందించింది. 30వేల రూపాయలు గ్రాంటుగా మంజూరు చేసింది. సోము హనుమయ్య కుటుంబం 15 ఎకరాల స్థలాన్ని అందజేసింది. దీంతో మరికొన్ని భవనాలు నిర్మించారు. విశాలమైన క్రీడా మైదానం ఏర్పాటైంది. 1945లో ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెందింది. ప్రభుత్వ సహకారంతో వి.వి. ఎయిడెడ్ ఉన్నత పాఠశాలగా మారింది. మల్లెల రత్తమ్మ ప్రథమ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె కుమార్తె యశోదమ్మ అధ్యక్షురాలయ్యారు. ఆమె హయాంలోనూ కొత్త భవనాలు నిర్మించారు. యశోదమ్మ మరణం తర్వాత కనకయ్య ఈ పాఠశాల నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 1975 నుంచి 2017 వరకు ఆయనే పాఠశాల ఛైర్మన్‌గా ఉంటూ వచ్చారు. పాఠశాల అభివృద్ధికి ఎంతగానో శ్రమించిన ఆయన కాలంలోనే జూనియర్, డిగ్రీ కళాశాలతో పాటు తెలుగు పండిట్ కాలేజినీ ఏర్పాటు చేశారు. ఇలా వి.వి. పాఠశాల దినదిన ప్రవర్థమానమై ఎందరికో విద్యావెలుగులు పంచింది.

ఓ పాఠశాల ఇన్ని సంవత్సరాలుగా కొనసాగటం అంటే మాములు విషయం కాదు. యాజమాన్యం నుంచి అందిన ప్రోత్సాహంతో పాటు ఉపాధ్యాయులు కూడా చిత్తశుద్ధితో పని చేయటం వల్లే పాఠశాలకు ఇంతగా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. మొదట్లో ఇక్కడ పాఠాలు చెప్పిన వారిలోని అంకిత భావం మంచి పునాదులు వేసింది. ఆ తర్వాతా అదే ఒరవడి కొనసాగింది. ఒక దశలో ఈ స్కూళ్లో విద్యార్థుల సంఖ్య వెయ్యి వరకూ ఉండేది. గ్రంథాలయం, ప్రయోగశాల వంటి సౌకర్యాలు కూడా ఉండటంతో విద్యార్థులు మంచి విద్యను అందుకోగలిగారు. పాఠశాలలో విశాల క్రీడా మైదానం ఉండటంతో పిల్లల ఆటలు ఇబ్బంది లేదు. ఈ కారణంగానే... ఇక్కడి పిల్లల్లో శారీరక ధృడత్వం, చురుకుదనం ఎక్కువ అంటున్నారు పూర్వ విద్యార్థులు. బోధన, బోధనేతర అంశాలకు అన్నీ అవకాశాలుండటంతో.... తర్వాత కాలంలో భిన్నరంగాల్లో రాణించేందుకు ఉపయోగపడిందంటున్నారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టడంతో కొంత గందరగోళం నెలకొంది. అయితే ఆ తర్వాత ఎయిడెడ్ గా కొనసాగేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వటంతో ప్రస్తుతం అంతా సర్దుకుంది. యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం పాఠశాల నడుస్తోంది.

అప్పట్లో తాడికొండ చుట్టుపక్కల ఎక్కడా ఉన్నత పాఠశాలలు లేవు. దాంతో హైస్కూల్ విద్య కోసం తాడికొండ మండలంలోని 16 గ్రామాల విద్యార్థులకు వి.వి. పాఠశాలే పెద్దదిక్కుగా మారింది. అమరావతి, తుళ్లూరు మండలాల్లోని కొన్ని గ్రామాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకునే వారు. అలా.... ఇప్పటి వరకూ వేల మంది విద్యార్థులకు విద్యనందించింది... ఈ పాఠశాల. ముఖ్యంగా ఈ ప్రాంత బాలికా విద్యకు బాటలు వేసింది. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించింది. ప్రైవేటు పాఠశాలలు కూడా లేకపోవటతో 2000 సంవత్సరం వరకూ ఈ పాఠశాల నిత్యం నిండుకుండలా నడిచింది. ఆ తర్వాత ప్రైవేటు స్కూళ్లు వచ్చినా తన ప్రత్యేకతను మాత్రం నిలుపుకుంటూ వస్తోంది. ఇక్కడ చదువుకున్న వారిలో రాయపాటి సాంబశివరావు... తర్వాతి కాలంలో ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన సోదరులు శ్రీనివాస్ గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా, ఎమ్మెల్సీగా పని చేశారు. ప్రస్తుతం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థే. వీరితో పాటు... వందల మంది మంది వైద్యులు, ఇంజనీర్లకు ఈ పాఠశాలే... మొదటి గురువుగా నిలుస్తోంది. కొందరైతే ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు కూడా.

తెలుగు వారు గర్వించదగిన ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ ఇదే పాఠశాలలో చదువుకున్నారు. ఆయన మరణానంతరం... 2019లో ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల స్థాపనలో, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వారి విగ్రహాలూ ఇదే ప్రాంగణంలో ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారంతా తమ పాఠశాల ఘనచరిత్రను చూసి సంతోషిస్తుంటారు. తమకంటే ముందు ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వారు ఉన్నత శిఖరాల్లో ఉండటాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. తామూ ఉన్నత చదువులు చదివి....తన పాఠశాలకు మంచి పేరు తెస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటారు.

2005లో పాఠశాల 60ఏళ్ల వేడుకలు నిర్వహించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ సుశీల్‌ కుమార్ షిండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు 75 ఏళ్ల వేడుకలు కూడా ఘనంగా నిర్వహించేందుకు పాఠశాల కమిటీ నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఏడున్నర దశాబ్దాలుగా విద్యాపరిమళాలు వెదజల్లుతున్న ఈ పాఠశాల ఎందరో పిల్లల జీవితాల్లో వెలుగులకు కారణమైంది. ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులు భావి జీవితాలకి పునాదులు వేస్తూ... వందేళ్ల ప్రస్థానం వైపు అడుగులు వేస్తోంది.


ఇదీ చదవండి : CM Jagan: 'ఆదిత్య బిర్లా కంపెనీ' ద్వారా తొలిదశలో 2 వేల మందికి ఉద్యోగాలు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details