గుంటూరు జిల్లా వినుకొండ మండలం తిమ్మాయపాలెం వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన 15 మంది కూలీలు భవన నిర్మాణ పనులకి వెళ్లి, సాయంత్రం ఆటోలో ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యలో నవాజ్కుంట వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురికి కూలీలు గాయపడగా.. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న వారిని గుంటూరుకు పంపనున్నట్లు వైద్యులు తెలిపారు.
అనంతపురం రూరల్ కామారుపల్లి సమీపంలో...
అనంతపురం రూరల్ కామారుపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నంపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతుండగా, బొలెరో వాహనం ఢీకొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారుపల్లి ప్రదేశంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.