సామాన్యుల క్లిక్... మితిమీరిన వేగానికి ట్రాఫిక్ పోలీసుల చెక్ - police
గుంటూరు ట్రాఫిక్ పోలీసులు... సామాన్యుల వాట్సాప్ సందేశాలపై సత్వరమే స్పందించి... ఆకతాయిల చర్యలకు చెక్ పెడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు మీరిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.
మితిమీరిన వేగంతో విచ్చలవిడి డ్రైవింగ్ చేసేవారితో పాటు... వాహనాలపై ప్రెస్, పోలీస్ అని రాసుకుంటూ హల్చల్ చేస్తున్న ఆకతాయిలపై... గుంటూరు పోలీసులు కన్నెర్ర చేశారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలా డ్రైవింగ్ చేసే వారి వివరాలను.. నగరవాసులు నుంచి వాట్సాప్ ద్వారా సేకరిస్తున్నారు. సత్వరమే స్పందిస్తున్నారు. అరండల్ పేట ఫ్లై ఓవర్ ఫుట్ పాత్ పై ఓ వాహనం వెళ్తుండగా స్థానికులు ఫొటో తీసి ట్రాఫిక్ డీఎస్పీకి వాట్సాప్ చేశారు. తక్షణమే స్పందించిన ట్రాఫిక్ డీఎస్పీ సుప్రజ... వివరాలు తెలుసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. సంబంధిత వాహన యాజమానిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలను నడిపితే చట్ట పరమైన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. కొత్త చట్టాలపై ప్రజలు అవగాహన ఏర్పరచుకొని ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు. ప్రజలు తమ దృష్టికి వచ్చిన ట్రాఫిక్ సమస్యలకు ఇలాగే ఫోటో తీసి పంపాలని కోరారు.