Cleaning Machine in Amaravati: రాజధాని అమరావతిలో నిర్మాణాలను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం.. అక్కడి ప్రజలకు అందించాల్సిన సేవలపైనా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనుల కోసం గతం ప్రభుత్వ హయాంలో తెప్పించిన లక్షల విలువైన యంత్రాలను మూలన పడేయటంతో అవి పనికిరాకుండా పోతున్నాయి. అమరావతిపై ప్రభుత్వం కక్షగట్టడం వల్లే ఈ విధంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో వాహనం విలువ 60లక్షలపైమాటే:అమరావతి పరిధిలోని గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు, వ్యర్థాలను తరలించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ ఆధునిక యంత్రసామాగ్రిని కొనుగోలు చేసింది. వీటిని తుళ్లూరు పాత సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఉంచారు. వీటిలో హైడ్రాలిక్ యంత్రాలతో పాటు అధునిక డస్ట్ బిన్లు ఉన్నాయి. ఒక్కో వాహనం విలువ 60లక్షలపైమాటే. ఇలాంటి వాహనాలు పదికి పైగా అక్కడ మూలన పడేసి ఉన్నాయి. భారీ సంఖ్యలో తెప్పించిన చెత్త డబ్బాలు సైతం వృథాగా పడేశారు. ప్రతి వీధిలోనూ డస్ట్ బిన్లు ఏర్పాటు చేసి ఇళ్లలో పోగయ్యే చెత్తను అక్కడ వేయాలి.
తుప్పుపట్టి పాడైపోతున్న వాహనాలు: హైడ్రాలిక్ యంత్రాలతో కూడిన వాహనం ద్వారా ఆ డస్ట్ బిన్లలోని చెత్తను తరలించి డంపింగ్ యార్డుకు చేర్చాల్సి ఉంటుంది. ఇలా చెత్తను సేకరించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఉద్దేశించిన వాహనాలు ఇప్పుడు తుప్పుపట్టి పాడైపోతున్నాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ శిథిలమవుతున్నాయి. వీటిని మంగళగిరి, తాడేపల్లి పురపాలికలకు కేటాయిస్తామని గతంలో అధికారులు ప్రకటించారు. కానీ ఆ పని చేయకుండా వదిలేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.