ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అదే మాట.. అదే తీరు..నెరవేరని దశాబ్దాల కల

గుంటూరు ఛానెల్​ పొడిగింపు డిమాండ్​ ఇప్పటికీ నెరవేరడం లేదు. ఎనిమిది దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు సాగు, తాగు నీటికోసం ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

guntur-channel
గుంటూరు ఛానెల్

By

Published : Jul 25, 2021, 10:18 AM IST

గుంటూరు ఛానల్​ పొడిగింపు: నెరవేరని దశాబ్దాల కల

బ్రిటీష్ ప్రభుత్వంలో మొదలైన గుంటూరు ఛానెల్ పొడిగింపు హామీ ఇప్పటికీ నెరవేరడం లేదు. కరవు ప్రాంతానికి నీళ్లు ఇస్తామని చెబుతూ వచ్చిన పాలకులు ఆచరణలో శ్రద్ధ చూపకపోవడంతో ఎనిమిది దశాబ్దాలుగా ఆప్రాంత ప్రజలు, రైతులు సాగు, తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఆశించిన మేరకు అటు కృష్ణాజలాలు రాక.. ఇటు నాగార్జున సాగర్ నీళ్లు అందక అవస్థలు పడుతున్నారు. గుంటూరు ఛానల్​ను పొడిగించాలని సుదీర్ఘకాలంగా రైతు నాయకులు పోరాటాలు చేస్తున్నా 80ఏళ్ళ వారి శ్రమకు ఫలితం దక్కడంలేదు.

1936లో మొదలైన డిమాండ్​
ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాలకు తాగు, సాగు నీటి సమస్య పరిష్కారానికి గుంటూరు ఛానల్​ను పెదనందిపాడు వరకు పొడిగించాలన్న డిమాండు 1936లో మొదలైంది. దాదాపు పదేళ్లపాటు రైతులు ఆందోళనలు చేశారు. 1953 నుంచి 1967 మధ్యకాలంలో పార్లమెంట్ సభ్యుడు తరిమెల నాగిరెడ్డి, శాసనసభలో ఎమ్మెల్యే వావిలాల గోపాలకృష్ణయ్య తదితరులు పెదనందిపాడు ఛానల్ను నిర్మించాలని కోరారు. ఈక్రమంలో 1961లో రాష్ట్ర అసెంబ్లీలో పెదనందిపాడు హైలెవల్ ఛానల్​పై చర్చసాగింది. ఇందులో కాలువను దగ్గుబాడు వరకు పొడిగించడానికి నిర్ణయిస్తూ గుంటూరు ఛానల్​గా పేరు మార్పుచేశారు. తర్వాత గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడు కృష్ణాకాలువ నుంచి యామర్రు వరకు మాత్రమే కాలువ నిర్మించారు. అప్పటి నుంచి కాలువ పొడిగించాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. 2002లో చిలకలూరిపేట వద్ద జాతీయ రహదారిని 8గంటల పాటు దిగ్బంధించి రాస్తారోకో చేయడంతో కొందరు రైతులు సంవత్సరాలపాటు కోర్టుల చుట్టూ తిరిగారు.

వైఎస్, చంద్రబాబు హామీ ఇచ్చినా..
2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పత్తిపాడు సభలో మాట్లాడారు. గుంటూరు ఛానల్​ పొడిగించి పెదనందిపాడు, పర్చూరు, పత్తిపాడు ప్రాంతాలకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత హామీ అమలు కాలేదు. 2014లో చంద్రబాబునాయుడు, 2018లో వైఎస్ జగన్మోహన్​రెడ్డి కూడా గుంటూరు-చానల్​ను పొడిగిస్తామని హామీ ఇచ్చారు. 2017లో పెదనందిపాడు, పర్చూరు, కాకుమాను, పత్తిపాడు మండల కార్యాలయాల వద్ద రైతులు ధర్నాలు చేశారు. నవంబరు, డిసెంబరులో 50గ్రామాల్లో వేలాదిమంది రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు. 2018 జనవరిలో పెదనందిపాడులో రైతులు సామూహిక నిరాహార దీక్షచేశారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విన్నవించారు. ఛానల్​ను పొడిగిస్తామని హామీ ఇచ్చారు.

మార్పులు జరిగినా..

2018 జూన్లో కాలువ సర్వేకు రూ.89లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. జలవనరులశాఖ అధికారులు డీపీఆర్ ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఛానల్ పొడిగింపునకు 686 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుందని గుర్తించిన అధికారులు యామర్రు నుంచి పర్చూరు వరకు దాదాపు 30కిలోమీటర్లకు ప్రణాళిక రచించారు. ఎనిమిదిచోట్ల ఓటీలు, ప్రధాన కాలువ వద్ద రెండు చోట్ల కవర్లు, 20 క్రాస్ డైనీజీలు, 15 చోట్ల వంతెనలు, నాలుగు ఎత్తిపోతల పథకాలతోపాటు ఆయకట్టు భూములకు నీరు ఇచ్చేందుకు కాలువల నిర్మాణం. వంటివి చేపట్టాలని నిర్ణయించారు. గుంటూరు ఛానల్​ను యామర్రునుంచి పర్చూరు వరకు పొడిగించడం ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పర్చూరు, పత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, ఎడ్లపాడు, చిలకలూరిపేట మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు... అలానే వందలాది గ్రామాలకు తాగునీరు అందుతుందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే దాదాపు 50 గ్రామాలకు తాగునీరు. 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈమేరకు 2019 జనవరిలో రూ.274 కోట్లు మంజూరు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత ప్రభుత్వం మారిపోగా తాజాగా బ్యాంకు రుణంతో పనులు చేపట్టేలా మార్పులు జరిగాయి. కానీ పొడిగింపు పనులు మాత్రం జరగలేదు.

నీటికోసం సుదీర్ఘ కాలంగా పోరాటం సాగుతున్నా పలువులు ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలు హామీలు ఇచ్చినా తమ ఆశలు ఫలించడంలేదని రైతు సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఇటీవల తెదేపా శాసనసభ్యులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఛానల్ పొడిగింపు పనులు చేపట్టి నీళ్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

బహుళ ప్రయోజనాలు సిద్ధించే ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటే రైతుల సుదీర్ఘ కల నెరవేరుతుంది. వందల గ్రామాలకు తాగు, సాగునీరు అందుతుంది.

ఇదీ చదవండి:Reservoirs: నిండుకుండలా జలాశయాలు..నీటిమట్టం ఎంతంటే..

ABOUT THE AUTHOR

...view details