గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నిరభ్యంతర పత్రాలతో ఏపీలోకి వచ్చేందుకు యత్నించిన యువకులను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ఓసీలు ఇచ్చినా.. అవి చెల్లవని తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. దీని వల్ల రెండు వేల మందికి పైగా రోడ్లపై నిలిచిపోయారు. సాయంత్రం వరకూ వేచి చూసిన విద్యార్థులు వెనక్కి వెళ్లి.. సాయంత్రం 6 గంటల సమయంలో మళ్లీ సరిహద్దుల వద్దకు వచ్చారు. వీరు పొందుగుల మీదుగా సొంతూళ్లకు వెళ్లాలని భావించారు.
బలగాల మోహరింపు
విషయం తెలుసుకున్న పోలీసులు అంతర్రాష్ట్ర సరిహద్దులో భారీగా బలగాలను మోహరించారు. కృష్ణా నది బ్రిడ్జిపై ఇనుప కంచెలు వేసి రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. ఒకవేళ ఎవరైనా ఏపీలోకి రావాలంటే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అక్కడే వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. గుంటూరు అదనపు ఎస్పీ సరిహద్దు వద్ద పరిస్థితిని సమీక్షించారు.
విద్యార్థుల ఆగ్రహం
పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి వేచి చూస్తున్నా.. వైద్య పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేవలం వైద్య పరీక్షలు జరిపి వ్యాధి లక్షణాలు లేకపోతే తమ ఇళ్లకు వెళ్లేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు సరిహద్దు దాటేందుకు యత్నించడం వల్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు.