TENSION AT ANNA CANTEEN : గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్‌ను పోలీసులు, అధికారులు తొలగించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఆగస్ట్ 12న స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద తెదేపా నేతలు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి.. రోజూ వెయ్యి మంది నిరుపేదలకు ఆహారం అందిస్తున్నారు. నాలుగురోజులుగా ఇదే ప్రాంతంలో వైకాపా నేతలు కూడా అన్నదానం నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని.. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని మున్సిపల్ అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు.
ఇవాళ తెల్లవారుజామునే వందల మంది పోలీసులు మున్సిపల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని సమీపంలో ఉన్న దుకాణాల్ని మూసి వేయించారు. అన్నా క్యాంటీన్ ఆహార పదార్ధాల ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెదేపా కార్యకర్తలు ఆటోలోని కొన్ని ఆహార పదార్థాలతో మార్కెట్ సమీపంలోని పురవేదిక వద్ద ఆహార పంపిణీ చేపట్టారు. మున్సిపల్ అధికారులు పంపిణీ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తెదేపా శ్రేణులు నిరసనకు దిగాయి.
పేదల కడుపు కొట్టొద్దని అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. దాంతో మున్సిపల్ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో వైకాపా వారు మున్సిపల్ మార్కెట్ వద్ద అన్నదానానికి యత్నించారు.. అధికార పార్టీ వారికి మాత్రం ఎలా అనుమతిస్తారని పోలీసుల్ని తెదేపా నేతలు నిలదీశారు. మార్కెట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
తెదేపా శ్రేణులు పురవేదిక వద్ద చేస్తున్న ఆహార పంపిణీని పోలీసులు అడ్డుకున్నారు. ఆహార పదార్ధాల్ని లాగి పక్కన పెట్టేశారు. తెదేపా కార్యకర్తల్ని బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించారు. పేదల ఆకలి తీర్చే కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని తెదేపా నాయకులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇనుప కంచెలతో పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.