పొలిట్‌బ్యూరోలో చర్చలు... ప్రక్షాళణ దిశగా నిర్ణయాలు...! - గుంటూరు
ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు చర్చిస్తున్నారు నేతలు. ఈ భేటీకి తెలంగాణ నేతలూ హాజరయ్యారు.
అమరావతిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశమైంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరిగింది. ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ చేయనున్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో కొత్త కమిటీల ఏర్పాటుకు చేయాల్సిన కసరత్తుపై సమాలోచనలు జరుపుతారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా నేతలతో ఆయన మంతనాలు జరుపుతారు. ఈ సమావేశానికి తెలంగాణ నేతలూ హాజరయ్యారు. పొలిట్‌బ్యూరో సమావేశానికి హాజరైన నేతలను, అధినేత చంద్రబాబును... గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ తరహా ఆహ్వాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.