కరోనా లాక్ డౌన్ కారణంగా తెలుగు విద్యార్థులు కిర్గిస్థాన్ దేశంలో చిక్కుకుపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులు కరోనా కారణంగా అక్కడే ఉండిపోయారు. కిర్గిస్థాన్ లోని 4 వైద్య కళాశాలల్లో వీరంతా చదువుతున్నారు. ఏపీ, తెలంగాణా నుంచి రెండు వేల మందికి పైగా ఉన్నట్లు వారు ఈటీవీ భారత్కు తెలిపారు.
వందే భారత్ కింద కేంద్ర ప్రభుత్వం విమానాలు ఏర్పాటు చేసినప్పటికీ కేవలం రెండు సర్వీసులు మాత్రమే నడిచాయని వారు చెప్పారు. అందులో నాలుగైదు వందల మించి వెళ్లలేకపోయామన్నారు. మిగతా వేలాది మంది విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు ఎదురు చూస్తున్నట్లు వివరించారు. విమానాలు ఏర్పాటు చేయాలని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా సానుకూలంగా స్పందించలేదని వాపోయారు.