కేరళలో విధులు నిర్వర్తిస్తున్న చిలకలూరిపేటకు చెందిన యువ ఐఏఎస్ అధికారి మైలవరపు వెంకటకృష్ణ తేజకు ఓ అరుదైన అవకాశం లభించింది. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 50 మంది మహిళా శాస్త్రవేత్తలకు వెబినార్ విధానంలో శిక్షణ అందించారు. ‘క్లైమేట్ ఛేంజ్ ఛాలెంజెస్ అండ్ రెస్పాన్స్’ కార్యక్రమంలో భాగంగా తాను అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్‌గా పనిచేసిన 2018 సంవత్సరంలో వచ్చిన వరదల్లో ‘కుట్టనాడు ఆపరేషన్’ ద్వారా అక్కడ 2 లక్షల మంది ప్రజలను సురక్షితంగా కాపాడిన అంశాలను వారితో పంచుకున్నారు.
శబరిమల ప్రాంతంలో వర్షాలు అధికంగా పడటం, 1.5 అడుగుల నీటిమట్టం పెరిగితే అలెప్పీ జిల్లాలోని కుట్టనాడు లోతట్టు ప్రాంతం కావడంతో వరదలు వచ్చి ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన కృష్ణతేజ 'కుట్టనాడు ఆపరేషన్' ద్వారా కేవలం పడవలతో 24 గంటల వ్యవధిలోనే 2 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు చేరేలా చర్యలు చేపట్టారు. ఆ సమయంలో తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన ఆపరేషన్ తదితర అంశాలు శాస్త్రవేత్తలకు వివరించారు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేలా సిద్ధం కావాలని సూచించారు. శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చే అవకాశం రావడం సంతృప్తినిచ్చిందని కృష్ణతేజ వివరించారు.