గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శివారులో దాడికి గురై తీవ్ర గాయాలతో నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తుమ్మల చెరువుకు చెందిన తెదేపా కార్యకర్త సైదాను రాష్ట్ర తెదేపా ముస్లిం మైనారిటీ నేతలు పరామర్శించారు. బాధితుడికి తెదేపా అండగా ఉంటుందని మైనారిటీ నేతలు భరోసా ఇచ్చారు. ఇందులో రాష్ట్ర ముస్లిం మైనారిటీ నాయకుడు మౌలానా ముస్తక్ అహ్మద్, గుంటూరు తూర్పు ముస్లిం మైనారిటీ ఇంఛార్జి నజీర్ అహ్మద్, నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు(Muslim minority leaders on attack on saida) రక్షణ కరువైందని నేతలు ఆరోపించారు. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువుకు చెందిన తెదేపా కార్యకర్త సైదాపై వైకాపా దాడి దుర్మార్గపు చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైకాపా ఫ్యాక్షన్ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. నకరికల్లు, దాచేపల్లిలో అధికార పార్టీ దాడులకు భయపడి సుమారు వంద ముస్లిం కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయాయని వెల్లడించారు. దాడికి గురైన బాధితుడు సైదాపైనే పిడుగురాళ్ల సీఐ ప్రభాకర్ తప్పుడు కేసు పెట్టడంపై వారు ఆక్షేపించారు. ఆరు నెలల క్రితం అలీసా అనే యువకుడిని ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి కొట్టి చంపారని.. ఆ కేసు పురోగతి ఎక్కడివరకు వచ్చిందో చెప్పాలని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు వైకాపా కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెదేపా కార్యకర్త సైదాపై దాడికి పాల్పడ్డ నిందితులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే.. తెదేపా ఆధ్వర్యంలో పల్నాడులో భారీ ఎత్తున ధర్నాలు చేపడతామని రాష్ట్ర ముస్లిం మైనారిటీ నేతలు హెచ్చరించారు.
అసలు ఏం జరిగిందంటే..
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతంలో ఓ వ్యక్తిపై పలువురు అత్యంత పాశవికంగా దాడి (attack on TDP supporter at Pidduguralla) చేశారు. పట్టణ శివారులో రోడ్డు డివైడర్‌పై పడేసి కొందరు వ్యక్తులు కాళ్లూ చేతులు పట్టుకోగా.. మరో వ్యక్తి కిరాతకంగా బండరాయితో మోదాడు. దెబ్బలు తాళలేక బాధితుడు విలవిల్లాడుతున్నా.. ఏ మాత్రం కనికరం లేకుండా చావబాదారు. రాడ్లు, జాకీలతోనూ విచక్షణారహితంగా దాడికి తెగ బడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన సైదాగా గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనంలో నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఓ వివాహ వేడకకు హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా నాపై దాడి చేశారు. మేం మెదటి నుంచి తెదేపాలో పనిచేస్తున్నాం. గతంలో పార్టీల వ్యవహారం, పొలం గట్ల వివాదం మా మధ్య ఉంది. శివారెడ్డి, హేమంత్ రెడ్డి, పున్నారెడ్డి, ప్రతాప్ రెడ్డి, అన్నపురెడ్డి నాపై దాడి చేశారు. వీరితో పాటు నరసరావుపేటకు చెందిన పలువురు వ్యక్తులు దాడిలో పాల్గొన్నారు. - సైదా, దాడికి గురైన బాధితుడు