జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీఎస్ పథకానికి వ్యతిరేకంగా తెదేపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఓటీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం..
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓటీఎస్ పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం నేతలు నిరసన చేపట్టారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు.. పార్టీ నేతలతో కలిసి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించారు. ర్యాలీగా కలెక్టరేట్ వరకూ వెళ్లి అధికారులకు వినతి పత్రం అందజేశారు. పేదలను ఓటీఎస్ పేరుతో వేధించడం సరికాదని తెదేపా ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి, పార్టీ నేత దామచర్ల జనార్దన్ మండిపడ్డారు.
తూర్పుగోదావరి..
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తెలుగుదేశం శ్రేణులు ఓటీఎస్‌కు వ్యతిరేకంగా భారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటీఎస్ రద్దు చేయాలంటూ తెలుగుదేశం నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, కొండబాబు నిరసన చేపట్టారు. నిరసనకారులను పోలీసుల అడ్డుకొనే ప్రయత్నం చేయగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్డుపైనే నేతలు బైఠాయించారు.
కడప ..
కడప కలెక్టరేట్ ముట్టడికి తెదేపా నాయకులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన గేటు తోసుకుని వెళ్లేందుకు తెదేపా నాయకులు యత్నించారు. ఓటీఎస్ పథకానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం పేదలను మోసం చేస్తుందంటూ నేతలు మండిపడ్డారు.
గుంటూరు ..
ఓటీఎస్ రద్దు కోరుతూ.. గుంటూరులో తెలుగుదేశం పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన చేపట్టారు. మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యేలు జీవీ అంజనేయులు, యరపతినేని శ్రీనివాస్, కొమ్మాలపాటి శ్రీధర్, తెనాలి శ్రావణ్ కుమార్, తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులకు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు.
విశాఖపట్నం..
పేదలకు గుదిబండగా మారిన ఓటీఎస్ పథకాన్ని రద్దు చేసి, ఉచితంగా పేదలకు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ...విశాఖపట్నంలో తెదేపా ఆందోళనలు చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ తరఫున ఓటీఎస్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.