దళితులపై జరుగుతున్న దాడులకు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా గుంటూరులో నిరసన దీక్ష చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎస్సీలపై దాడులు పెరిగాయన్నారు. వైకాపా గెలుపునకు ప్రధాన పాత్ర పోషించిన దళితలపైనే దాడులు చేయడం బాధాకరమన్నారు.
దళిత యువకుడిని విచక్షణా రహితంగా కొట్టి.. శిరోముండనం చేసిన కేసులో ప్రధాన ముద్దాయి నూతన నాయుడుని ఎందుకు అరెస్ట్ చేయలేదని అయన ప్రశ్నించారు. నూతన నాయుడు వైకాపా నాయకుడు కాబట్టే కేసును నీరుకార్చుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు జరిగాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా దళితలపై దాడులను అరికట్టాలని... లేనిపక్షంలో దళితల సంఘాలు అన్నీ ఏకమై ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు.
'నూతన నాయుడు వైకాపా వ్యక్తి అని అతని ఆడియోలు, వీడియోలు చూస్తే అర్థమవుతుంది. వైకాపా నాయకుడు కాబట్టే శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయి అయినప్పటికీ అతన్ని అరెస్ట్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం దళితులపై దాడులు చేసేవారికి కొమ్ముకాస్తోంది. సీతానగరంలో మొదటి శిరోముండనం కేసు జరిగినప్పుడే నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే రెండో ఘటన జరిగేదికాదు.'-- నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి