వైకాపా నాయకుల తీరు నచ్చక తెదేపాలో చేరితే... పోలీసుల సాయంతో వైకాపా శ్రేణులు తమను వేధిస్తున్నారని గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని 20వ వార్డుకు చెందిన కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. నరసరావుపేట 21వ వార్డులో ఇళ్ల స్థలాల పంపిణీకి అక్కడి వాలంటీర్ లంచం ఇవ్వాలని కోరడంతో వివాదం నెలకొంది. ఈ వివాదంతో 20వ వార్డుకు చెందిన కొన్ని కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి.
వైకాపా నేతలకు పోలీసులు వత్తాసు
తెదేపాలో చేరడంతో.. వైకాపా నేతలు పోలీసుల సహాయంతో తమను వేధిస్తున్నారంటూ స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు. తమ ఇళ్లల్లో మద్యం నిల్వలు ఉన్నాయంటూ పోలీసులతో మంగళవారం సోదాలు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి చదలవాడ అరవిందబాబు బాధితులను పరామర్శించారు. వైకాపా నాయకుల మాటలు విని పోలీసులు సోదాలు నిర్వహించడం దారుణమన్నారు. నరసరావుపేట ఒకటో పట్టణ సీఐ ప్రభాకరరావు తెదేపా శ్రేణుల ఇళ్లపై మద్యం సోదాలు నిర్వహించడంపై న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు. మరోసారి ఇటువంటి దాడులు జరిగితే సహించేది లేదని అరవిందబాబు హెచ్చరించారు.
ఇదీ చదవండి :భాజపా నేతపై హత్యాయత్నం... సమగ్ర విచారణకు పవన్ డిమాండ్