ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేశవ్యాప్త ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తాం: గల్లా జయదేవ్

తెదేపా సీఏఏకు మద్దతు తెలిపింది కానీ.. దేశవ్యాప్త ఎన్​ఆర్​సీకి కాదని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. ఒక వర్గంపై వివక్ష చూపే చర్యలను తెదేపా వ్యక్తిరేకిస్తుందని తెలిపారు. రాజధాని కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలు, రైతులపై పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 144 సెక్షన్ ఎందుకు విధించారని గల్లా మండిపడ్డారు. రాజధాని ఘటనలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు.

MP Galla jayadev
ఎంపీ గల్లా జయదేవ్

By

Published : Jan 11, 2020, 5:53 PM IST

ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తామన్న తెదేపా ఎంపీ గల్లా జయదేవ్​
వర్షాకాల సమావేశాల్లో.. పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు తెదేపా మద్దతు తెలిపిందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తెదేపా సీఏఏకి మద్దతు ఇచ్చింది కానీ ఎన్​ఆర్​సీకి కాదని తెలిపారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఎన్​ఆర్​సీలో చాలా లోపాలున్నాయన్నారు. ఒక రాష్ట్రంలో విఫలమైన ప్రక్రియను దేశవ్యాప్తంగా అమలు చేయడం సరికాదన్నారు. సమాజంలో ఒక వర్గంపై వివక్ష చూపే దేశవ్యాప్త ఎన్​ఆర్​సీని తెదేపా ఎట్టి పరిస్థితిల్లో ఒప్పుకోదని స్పష్టం చేశారు. ఎన్ఆర్​సీ దుర్వినియోగమయ్యే ప్రమాదముందన్నారు. ఎన్​ఆర్​సీలో సరైన పత్రాలు చూపలేని వారికి డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు.

శాంతియుతంగా ఆందోళన చేస్తే.. 144 సెక్షన్ ఎందుకు..?

రాజధాని తరలింపు నిర్ణయం సరికాదని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. 3 రాజధానుల నిర్ణయం అర్థరహితమన్న ఆయన... రైతులకు నిరసన తెలిపే హక్కు లేదా అని నిలదీశారు. రైతులు, మహిళలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే 144 సెక్షన్ ఎందుకు విధించారని మండిపడ్డారు. రైతులను పెయిడ్ అర్టిస్టులు అనడం దారుణమని అన్నారు. రైతులు సెల్ ఫోన్లు వాడకూడదా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details