వైకాపా ప్రభుత్వం చెత్త మీద విధించిన పన్ను, అనధికారికంగా తొలగించిన పెన్షన్లపై నిరసనగా భాజపా నాయకులు గుంటూరులో ధర్నా నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కనుమరుగైందని.. ఎన్నికలంటే ఏదో ఒక కుంటిసాకు చెప్పి పోటీ చేయకుండా తప్పుకుంటున్నారని తెదేపాను విమర్శించారు. 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేసే సత్తా తెదేపా నేతలకు లేదని ఆయన ఎద్దేవా చేశారు.
వైకాపా ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం పోషించే ఏకైక పార్టీ భాజపానే అన్నారు. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని ఎన్నికల్లో పోటీచేసే సత్తా కేవలం భాజపాకే మాత్రమే ఉందని... ఏ ఒక్క ఎన్నికను కూడా విరమించేది ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరిని తప్పుపట్టారు. వైకాపా ప్రభుత్వంపై నమ్మకం లేకనే ప్రభుత్వానికి పని చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు.