ఆస్తి మూలధన విలువ ఆధారంగా విధించే పన్ను అమలులోకి వచ్చింది. ఇందుకోసం పట్టణ స్థానికసంస్థలు ఇప్పటికే నోటీసులు జారీచేయడం మొదలుపెట్టాయి. జీవో 198 ప్రకారం మూలధన విలువపై విధించే పన్నుతో సమానం అయ్యేవరకూ ఏటా 15% మేర పెరిగితే భారం తప్పదన్న విషయం ప్రజలకు అర్థమవుతోంది. కొత్త విధానంలో మొత్తం పన్ను పెంపు 100-300 శాతం వరకూ ఉంది. పెంపు ఏడాదికి 15% మాత్రమే ఉండటంతో ఇప్పటికిప్పుడు భారం కనిపించదు గానీ, కొన్నాళ్ల తర్వాత తెలుస్తుంది. గుంటూరు నగరపాలక సంస్థలో పన్ను పెంచుతూ తాజాగా నోటీసులు ఇచ్చారు. మిగిలిన పట్టణ స్థానిక సంస్థల్లో కూడా నోటీసులు వస్తే గానీ, అక్కడి ప్రజలకు ఎంత భారం పడేదీ తెలియదు.
* ఉదాహరణకు పట్టాభిపురంలోని డోరు నంబరు 3-2-40/1లో ఇంటిపై 216%, రామానుజకూటంలో 30-20-103లో ఇంటిపై 297% పెరుగుదల ఉంది. పెంపులో మొదటి ఏడాది 15 శాతానికి పరిమితం చేయడంతో 2021-22లో పన్ను భారం తక్కువగా ఉన్నట్లు అనిపించినా ఏటా పెంచితే తడిసి మోపెడవుతుందని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కొత్త ఇళ్లకు పూర్తి పన్ను
* కొత్తగా నిర్మించిన భవనాలకు రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నేరుగా కొత్త పన్ను విధిస్తారు. వీటికి ఏటా 15% పెంపుదల వర్తించదు. కొత్త పన్నులపై తాఖీదులు జారీచేస్తున్న కారణంగా పురపాలకశాఖ కొన్ని ఆన్‌లైన్ సేవలను తాత్కాలికంగా ఆపింది. వీటిలో కొత్త ఇళ్లు, భవనాలకు పన్ను విధింపు ఒకటి. పోర్టల్‌లో మార్పులు అందుబాటులోకి వచ్చాక పన్నులు విధించాలన్న ఆదేశాలతో ప్రస్తుతం నిలుపుదల చేశారు.
* ఉదాహరణకు ఆస్తి మూలధన విలువ ప్రకారం గుంటూరులో ఒక ఇంటి విలువ రూ.50 లక్షలు అనుకుంటే... దానిపై 0.065% పన్ను విధిస్తారు. అంటే 6 నెలలకు రూ.3,250 (ఏడాదికి రూ.6,500) పన్ను చెల్లించాలి.