ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దళితులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవు: హోంమంత్రి

రాష్ట్రంలో దళిత వర్గాలపై దాడులు పెరిగాయనేది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారమేనంటున్నారు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. రెండు, మూడు ఘటనల్ని చూపెట్టి ఆ వర్గం మొత్తానికి అన్యాయం జరుగుతోందనటం సరికాదన్నారు. తప్పు చేసిన పోలీసులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని... తమ పార్టీ వారి ప్రమేయం ఉన్నా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. తమది పేద వర్గాల ప్రభుత్వం అంటోన్న మేకతోటి సుచరితతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.

Home Minister
మేకతోటి సుచరితతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి

By

Published : Jul 25, 2020, 12:57 AM IST

మేకతోటి సుచరితతో ముఖాముఖి

ప్రశ్న:రాష్ట్రంలో దళిత వర్గాలపై దాడులు పెరిగాయని ఇటీవలి ఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఇదే విషయంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. దీనిపై మీరేమంటారు..?

జవాబు: రాష్ట్రంలో జరిగిన రెండు, మూడు ఘటనల్ని చూపి అలాంటి ప్రచారం చేయటం సరికాదు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో కారు వెళ్లి బైకుని ఢీకొట్టింది. దీనిపైన ఇరు వర్గాల వారు కేసులు పెట్టుకున్నారు. అయితే అక్కడ పోలీసులు అతిగా ప్రవర్తించారు. వారిపైన చర్యలు తీసుకోవటంతో పాటు కేసులు కూడా పెట్టారు. ఎక్కడా ప్రభుత్వం దాన్ని ఉదాసీనంగా లేదు. చీరాల ఘటనలో కూడా కిరణ్ అనే యువకుడు మాస్క్ లేకుండా బైక్​పై వెళ్తున్నారు. పోలీసులు ఆపారు. మద్యం మత్తులో అతను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అక్కడ కూడా పోలీసులపై చర్యలు తీసుకున్నాం. ఈ రెండు ఘటనలు కూడా దళితులని జరగలేదు. అనుకోకుండా జరిగినవే. అయినా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకున్నాం.

ప్రశ్న: వైకాపాకు ఓట్లేసి గెలిపించిన దళిత వర్గాలపై ప్రభుత్వం కక్ష గట్టిందనే ఇతర రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. దీనికి ఏం సమాధానమిస్తారు..?

జవాబు: రాజకీయంగా ఏదో ఒక విమర్శ చేయాలని మాట్లాడుతున్నారు. దళితులపై దాడులు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పారు. కాబట్టి వీటిని కులాలకు జరిగిన విషయంగా భావించరాదు. ఐదుగురి ఎస్సీలకు మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు కేటాయించారు. 60శాతానిపైగా వెనుకబడిన వర్గాల వారే మంత్రివర్గంలో ఉన్నారు. ఇంతమందికి చోటు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్​దే. పేద, బడుగు వర్గాలకు మంచి చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమ పథకాల్లో కూడా అగ్రస్థానం వారిదే. కానీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఈ విషయాల్ని గమనించాలి.

ప్రశ్న: హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన మహిళ ఉన్న సమయంలో.. మహిళలపై అఘాయిత్యాలు, దళితులపై దాడులు పెరిగాయనేది మీపై వస్తున్న విమర్శ. దానికి మీరేమంటారు..?

జవాబు: రెండు ఘటనల్ని బట్టి దళితులపై దాడులు అంటున్నారు. డాక్టర్ సుధాకర్ మద్యం సేవించి రోడ్డుపై ఇష్టారాజ్యంగా మాట్లాడారు. డాక్టర్ అనితారాణి కూడా అక్కడ రోగులకు వైద్యం చేయటానికి నిరాకరించారు. అలాంటి వాటికి దళితులకు ముడిపెట్టి మాట్లాడటం సరికాదు. వాళ్లు ఏమైనా దళిత హక్కుల కోసం పోరాడారా..? దళిత వ్యతిరేకి అని ఎప్పుడు మాట్లాడాలి. ఎవరైనా దళితుల కోసం పోరాడుతుంటే వారిని వేధిస్తే అలా మాట్లాడొచ్చు. కానీ ఇపుడు ఒకటి అరా కేసులను బట్టి దళిత వ్యతిరేక ముద్ర వేయటాన్ని ఖండిస్తున్నా.

ప్రశ్న:సీతానగరం ఘటనలో దళిత యువకునికి శిరోముండనం ఘటనలో మీ పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. వారిపైనా చర్యలుంటాయా..?

జవాబు: ఆ ఘటనపై నిస్పక్షపాతంగా విచారణ జరిపిస్తున్నాం. నివేదిక రాగానే అందులో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవు. నెల్లూరులో ఓ మహిళా అధికారి మా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యేపై కేసు పెట్టిన ప్రభుత్వం మాది. కానీ గత ప్రభుత్వంలో మహిళా అధికారి పట్ల ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి చాలా తేడా ఉంది.

ఇదీ చదవండీ... కరోనా బాధితుల్ని చేర్చుకోని ఆసుపత్రులపై కఠిన చర్యలు: హోంమంత్రి సుచరిత

ABOUT THE AUTHOR

...view details