Agitations for compensation to farmers ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతు సంఘం, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రైతులను ఆదుకోకపోతే దశలవారీ ఆందోళనలు చేపడతామని ప్రకటించారు.
నెల్లూరు జిల్లాలో..
Agitations At Nellore: అకాల వర్షం, వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుసంఘం నేతలు ధర్నా చేపట్టారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. దిక్కుతోచని స్థితిలో ఉన్నారని రైతు సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో దాదాపు రూ.1500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. ఎకరాకు రూ.లక్ష వరకు రైతులు నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. పంట నష్టం జరిగిన రైతులకు రూ. 50వేల పరిహారమిచ్చి ఆదుకోవాలని.. పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లాలో..
Agitations At Kadapa: కడప నగరంలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన పేదలకు పరిహారం ఇవ్వాలని కోరుతూ.. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆద్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ప్రజా సంఘాల నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నగరంలో రహదారులు అద్వాన్నంగా తయారయ్యాయని.. వాటి మరమ్మతులకు చర్యలు చేపట్టాలని నినదించారు. నగరవాసుల సమస్యలను అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజాసంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కడప కార్పొరేషన్లో సర్వసభ్య సమావేశం సమయంలో లోపలికి వెళ్లేందుకు ప్రజాసంఘం నాయకులు యత్నించారు. దీంతో ఐక్య వేదిక నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
గుంటూరు జిల్లాలో..
Agitations At Guntur: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు సంఘం నాయకులు, సీపీఐ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పరిహారం చెల్లించి, రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. నష్టపోయిన రైతులకు తక్షణ సాయ కింద ఆహార పంటలకు రూ. 25వేలు, వాణిజ్య పంటలకు రూ. 50 వేలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు.