ministers comments: రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా ప్రకటించిన తెదేపా ప్రభుత్వం అక్కడ కేవలం తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించిందన్నారు. తిరుపతిలో అమరావతి ఐకాస బహిరంగ సభ వేదికగా అన్ని పార్టీలు ఒక్కటయ్యాయని అభిప్రాయపడ్డారు. వైకాపా ఎంత బలంగా ఉందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. గుంటూరులో ఓ ఫర్నీచర్ దుకాణం ప్రారంభించిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
అమరావతి విషయంలో భాజపా వైఖరి కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో మరోలా ఉందని మంత్రి అన్నారు. మూడు రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చెప్పిన విషయం ప్రస్తావించారు. కానీ ఇక్కడ మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలని భాజపా చెప్పటాన్ని తప్పుబట్టారు. ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు యూ టర్న్ తీసుకున్నారని, రాష్ట్ర ప్రజలంతా వద్దంటున్నా విశాఖ ఉక్కు ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని ప్రశ్నించారు. మొత్తంగా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా భాజపా వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు.