పెళ్లిళ్లు, పండుగలు, పూజలు.. ఇలా కార్యక్రమం ఏదైనా సరే పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే కొవిడ్ కారణంగా గతేడాది నుంచి శుభకార్యాలు పెద్దగా జరగటం లేదు. వరుసగా రెండు సంవత్సరాలు పెళ్లిళ్ల సీజన్‌ను కరోనా మింగేసింది. ప్రస్తుతం కరోనా రెండో దశ తగ్గుముఖం పట్టినందున ప్రజలు తిరిగి పండుగలు, శుభకార్యాలకు శ్రీకారం చుట్టారు. దీంతో పూల మార్కెట్లు మళ్లీ ఊపందుకున్నాయి.
శ్రావణ మాసం ప్రారంభం కావటంతో ప్రతి ఇంటా పూజలు మొదలయ్యాయి. అలాగే పెళ్లి ముహుర్తాలు కూడా ఉండటంతో వివాహాలు జరుగుతున్నాయి. రేపు శ్రావణ మాసం రెండో శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కావటంతో పూలకు గిరాకి పెరిగింది. గుంటూరు పూల మార్కెట్లో కొనుగోలుదారులతో సందడి కనిపించింది. వరలక్ష్మి వ్రతం పూజల కోసం పూలు కొనుగోలు చేసేందుకు జనం బాగానే వస్తున్నారని వ్యాపారాలు చెబుతున్నారు. బంతులు, చేమంతులు, గులాబీలు, మల్లెలు, జాజులకు డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు.