విద్యుత్తు పొదుపుగా వాడండి.. ఒక యూనిట్ ఆదా రెండు యూనిట్ల ఉత్పత్తికి సమానమన్న విద్యుత్తు శాఖ నినాదాన్ని అందిపుచ్చుకునే అవకాశాన్ని ఉద్యాన శాఖ కల్పిస్తోంది. శీతల గోదాములకు సౌర పలకల అమరికతో విద్యుత్తు ఛార్జీల భారం తగ్గించుకునే వెసులుబాటును కల్పిస్తూ రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. గోదాముల్లో నియంత్రిత వాతావరణ ఏర్పాటుకు శీతల యంత్రాలను ఏడాది పొడవునా వినియోగించాల్సి ఉంటుంది. ఇవన్నీ విద్యుత్తుతో పని చేయడంతో నెలకు రూ.లక్షల్లో బిల్లుల రూపంలో విద్యుత్తుశాఖకు చెల్లించాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా సోలార్ పలకలు అమర్చుకుంటే 25ఏళ్లపాటు విద్యుత్తు ఉత్పత్తి ద్వారా బిల్లుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జిల్లాలో ఇప్పటికే మూడు శీతల గోదాముల యజమానులు ముందుకొచ్చి సౌర పలకలు ఏర్పాటు చేసుకోగా మరికొందరు దరఖాస్తు చేశారు.
విద్యుత్తు బిల్లులో భారీ ఆదా
జిల్లాలో ఎండుమిర్చి విస్తారంగా పండడం, మిర్చికి అతిపెద్ద మార్కెట్ గుంటూరు కేంద్రంగా ఉండటంతో శీతల గోదాములు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు నగరం పరిసరాల్లో 85 ఉండగా జిల్లా మొత్తం కలిపి 120 దాకా ఉన్నాయి. శీతల గోదాములో నిల్వచేసే సామర్థ్యాన్ని అనుసరించి రోజుకు 800 నుంచి 1000 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగిస్తున్నారు. విద్యుత్తు శాఖ యూనిట్‌కు రూ.6.50 చొప్పున వసూలు చేస్తోంది. ఒక కిలోవాట్ సామర్థ్యమున్న సోలార్ యూనిట్ ఏర్పాటుకు రూ.40వేల వరకు ఖర్చవుతుంది. దీని నుంచి రోజుకు సగటున 4 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. శీతలగోదాముపై ఉన్న స్థలంలో 150 కిలోవాట్లకుపైగా సౌరపలకలు ఏర్పాటు చేసుకోవచ్ఛు గుంటూరు పరిసరాల్లో ఒక శీతలగోదాముపై 120 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ యూనిట్ ఏర్పాటు చేయడంతో రోజుకు సగటున 440 నుంచి 480 యూనిట్ల వరకు విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. గతంతో పోల్చుకుంటే నెలకు రూ.90వేల వరకు బిల్లులో తగ్గుదల ఉన్నట్లు యజమాని తెలిపారు. యూనిట్ ఏర్పాటుకు రూ.48లక్షలు వెచ్చించారు. ఇందుకు బ్యాంకు రుణం మంజూరు చేసింది. విద్యుత్తు బిల్లు రూపంలో మిగులుతున్న సొమ్మును నెలవారీగా బ్యాంక్ వాయిదాలు చెల్లించడానికి ఉపయోగిస్తున్నారు. ఏడేళ్లు బ్యాంక్ వాయిదాలు చెల్లిస్తే రుణం తీరిపోతుంది. అప్పటినుంచి మరో 18ఏళ్ల పాటు విద్యుత్తు బిల్లుల రూపంలో సొమ్ము ఆదా కానుంది. యూనిట్ వ్యయంలో గరిష్ఠంగా రూ.12లక్షల సొమ్మును ఉద్యానశాఖ రాయితీ కింద అందిస్తోంది. శీతలగోదాము నిర్వహణకు విద్యుత్తు అవసరం లేనప్పుడు మిగులు విద్యుత్తును అమ్ముకునే వెసులుబాటు ఉంది. పెద్దఎత్తున ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉన్నందున రాయితీ మొత్తాన్ని మరింత పెంచాలని శీతలగోదాముల యజమానుల సంఘం కోరుతోంది.