Sector Policing in Guntur: ఏదైనా సమస్యపై పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అధికారులు అంత త్వరగా స్పందించరని, స్టేషన్ చుట్టూ తిప్పుకుంటారనే విమర్శ ఉంది. ఫిర్యాదుదారులు చేసే ఇలాంటి విమర్శలకు తావులేకుండా సరికొత్త విధానానికి గుంటూరు అర్బన్ పోలీసులు కార్యరూపం ఇచ్చారు. "సెక్టార్ పోలింగ్" విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఒక్కో సర్కిల్లో మూడు నుంచి నాలుగేసి సెక్టార్లు ఏర్పాటు చేశారు. వాటికి ఎస్.ఐ.లను ఇన్‌ఛార్జులుగా నియమించి శాంతిభద్రతలను పర్యవేక్షించే విధానానికి శ్రీకారం చుట్టారు.
బాధితులు తమ వినతిని ఎవరికి చెప్పాలి? ఎవరిని కలిసి కేసు పురోగతి తెలుసుకోవాలనే విషయాలను ఫ్లెక్సీలలో ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతానికి ఎవరు ఎస్సై తెలిసేలా వారి వివరాలు, ఫోన్ నంబర్లు ముద్రించడంతో నేరుగా ఫిర్యాదుదారులు ఆ అధికారిని కలిసే అవకాశం ఏర్పడింది. ప్రతీ పోలీసు స్టేషన్లో ఉండే కానిస్టేబుళ్లను ఆయా సెక్టార్ల పరిధిలో ఎస్సైలకు తోడుగా పనిచేసేలా రోజువారీ చార్ట్ వేస్తున్నారు. గతంలో స్పష్టమైన పని విభజనలేక ఇబ్బందులు వచ్చేవి. సెక్టార్ విధానం వల్ల నేరాల నివారణ, నియంత్రణ, తక్షణ సాయం అందుబాటులోకి వస్తుందని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.
" జనవరి 1 నుంచి ఈ సెక్టార్ విధానం చేపట్టాం. జనాభా, నేరాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను చూసి సెక్టార్లుగా విభజించాము. ఈ సెక్టార్ లకు ఇన్‌ఛార్జులుగా ఎస్.ఐ.లను నియమించాము. వారు ఆ ప్రాంతాల్లో నేరాల పరిశీలన, పరిశోధన, శాంతిభద్రతలను పర్యవేక్షారు. ఈ విధంగా చేయడం ద్వారా స్టేషన్లలో పేరుకుపోయిన విచారణలో ఉన్న కేసులు తగ్గుతాయని భావిస్తున్నాము." -ఆరిఫ్ హఫీజ్, గుంటూరు అర్బన్ ఎస్పీ