భాజపా నాయకురాలు సాధినేని యామినీ శర్మ.. కాశీ విశ్వనాథ ట్రస్ట్ దక్షిణాది అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పాలకమండలి సీఈఓ విశాల్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. దేవాలయం చేస్తున్న కార్యక్రమాలను, అందిస్తున్న సేవలను ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలోని భక్తులకు ప్రచారం చేయాల్సిందిగా యామినీ శర్మను ఆలయ సీఈఓ తమ ఆదేశాల్లో కోరారు. ఎటువంటి పారితోషికం ఆశించకుండా, ఆలయం తరపున ఎటువంటి విరాళాలు స్వీకరించకుండా ఈ సేవలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కాశీ యాత్రకు వచ్చే భక్తులకు సరైన సమాచారాన్ని దక్షిణాదిలో మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలియ చేయాలని ఆలయ సీఈవో విశాల్ సింగ్ ఉత్తర్వుల్లో చెప్పారు.
తనకు కాశీ క్షేత్రం తరఫున పని చేసే అవకాశం రావటం పట్ల యామిని శర్మ సంతోషం వెలిబుచ్చారు. మహా పుణ్యక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లంగాలలో ఒకటైన కాశీ విశ్వనాథుని దేవాలయ ధార్మిక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలు అప్పగించినందుకు ఆలయ సీఈవోకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి క్షేత్రంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.