GMC Roads Damage: నగరపాలికలంటేనే పన్నుల బాదుడే బాదుడు.! ముక్కుపిండి వసూలు చేయడంలో గుంటూరు నగరపాలికది రాష్ట్రంలోనే మూడే స్థానం! మరి అలాంటి చోట రోడ్లెలా ఉన్నాయి..? ఈ ప్రశ్న ఏ వాహనదారుడిని అడిగినా.. ఆ ఒక్కటీ అడగకండి.. అనే సమాధానమే వినిపిస్తోంది. రోడ్డెక్కితే బైక్ చక్కగా కాదు అష్టవంకర్లు తిప్పాల్సి వస్తోందని బెంబేలెత్తిపోతున్నారు. శివారు కాలనీల్లోనైతే కొలవడానికి కొలబద్దలే కాదు, టేపులూ.. చాలనంత గోతులు తేలాయి. గుంటూరు నగర రోడ్లపై ఈటీవీ, ఈటీవీ భారత్ పరిశీలనాత్మక కథనం.
చూశారుగా.. వాహనాలు ఎలా ఊగుతున్నాయో. కార్లు, ఆటోలేకాదు.. ద్విచక్రవాహనాలైనా ఈ రోడ్డెక్కితే అంతే. తెలియక ఈదారిలో వచ్చి మరోసారి ఈవైపు రాకూడదని చెంపలేసుకునేవారు కొందరైతే గోతుల గురించి తెలిసినా మరో దారిలేక అలాగే ఒడిదొడుకుల ప్రయాణం చేస‌్తున్నవారు చాలా మంది ఉన్నారు. గుంటూరు నగరంలో అంతర్గత రహదారుల దుస్థితికి ఇదే నిదర్శనం.
ఇది గుంటూరు ఎన్జీవో కాలనీలోని భవానిపురం రోడ్డు. నగరంలో 50శాతానికి పైగా కాలనీల్లో రోడ్లు ఇలాగే ఉన్నాయి. భూగర్భ డ్రైనేజి కోసం తవ్వి సరిగా పూడ్చని ప్రాంతాలు కొన్నైతే.. అసలు రోడ్లే వేయని ప్రాంతాలు మరికొన్ని. భూగర్భ డ్రైనేజ్ పైపులైన్లు వేసినా.. రోడ్డు పూర్తిచేయలేదు. సిమెంట్‌గానీ, తారుగానీ వేయకుండా మట్టితో కప్పేసి సరిపెట్టారు. ఎంఎన్నార్ కల్యాణమండపం నుంచి నల్లపాడు ప్రధానరహదారి వరకు దాదాపు కిలోమీటరున్నర రహదారిని పరిశీలిస్తే, 43 గుంతలు కనిపించాయి. ఒక్కో గుంత కనిష్టంగా 5, గరిష్టంగా 20 సెంటీమీటర్ల లోతున్నాయి. 5 మీటర్లలోపు పొడవున్న గుంతలు 12 ఉండగా 5 నుంచి 10 మీటర్లలోపున్న గుంతలు 15, 10 నుంచి 15 మీటర్ల లోపు పొడవు కలిగిన గుంతలు 8 కనిపించయి. ఇక 15 నుంచి 20 మీటర్ల లోపున్న గుంతలు 5, 20 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న గుంతలు 3 ఉన్నాయి.